ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి యువకుడి బలి.. అప్పుల బాధ తాళలేక..
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:46 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
కామారెడ్డి, జూన్ 11: జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన స్థానిక ఎం.ఆర్. కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన క్రాంతి అనే యువకుడు ఆరు నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తెలిసిన వారి వద్ద, బయట పెద్ద ఎత్తున అప్పులు చేసి మరి బెట్టింగ్ ఆడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ గేమ్‌లలో క్రాంతి ఏకంగా రూ. 12 లక్షల వరకు నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే స్థానిక ఇందిరా నగర్ చర్చి వెనుక భాగంలో ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో చిక్కి, ఉన్న డబ్బులు పోగొట్టుకుని, అప్పుల పాలై ఒక యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కుటుంబ సభ్యులను తీరని శోకంలో ముంచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News And Telangana News