Share News

‘క్యూర్‌’లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:10 AM

కోర్‌ అర్బన్‌ రీజన్‌ (క్యూర్‌) పరిధిలోని 20 నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను దశలవారీగా నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 480 ఫ్లాట్ల చొప్పున ఇందిరమ్మ టవర్లు నిర్మించనుండగా, రాయదుర్గంలో 480 ఫ్లాట్లకు శంకుస్థాపన జరిగింది.

‘క్యూర్‌’లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు
Indiramma houses Telangana

  • 20 నియోజకవర్గాల పరిధిలో నిర్మిస్తాం ..

  • తొలి విడత కింద 480 ఫ్లాట్ల చొప్పున టవర్లు

  • పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం

  • శేరిలింగంపల్లిలో ఒక్కో ఫ్లాట్‌ విలువ దాదాపు రూ.1.25 కోట్లు

  • పేదల ఆత్మగౌరవానికి ప్రతీక

  • ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి

  • రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల

  • టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్‌ సిటీ/ రాయదుర్గం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో (క్యూర్‌- కోర్‌ అర్బన్‌ రీజన్‌లో) లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తామని, పేదల చిరకాలస్వప్నమైన సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. గజం భూమి రూ.5 లక్షలు పలికే అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇందిరమ్మ టవర్లు నిర్మించి ఫ్లాట్లను ఇస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని రాయదుర్గం గ్రామం మల్కం చెరువు వెనుక 2.85 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ బోగారపు దయానంద్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు ఫ్లాట్ల అలాట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాయదుర్గంలో నాలుగు టవర్లలో ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లు నిర్మిస్తామన్నారు.


పేద కుటుంబాల కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి భద్రత, భరోసా కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.1.25 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను, ఆన్‌డివైడెడ్‌ షేర్‌ కింద 15-20 గజాల స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ టవర్లు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదలకు నగరానికి దూరంగా 30-40 కి.మీ.ల దూరంలో ఎక్కడో ఇళ్లు ఇచ్చిందని, తమ ప్రభుత్వం లబ్ధిదారులు ఎక్కడ ఉపాధి పొందుతున్నారో అక్కడే ఖరీదైన స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు.


20 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం

క్యూర్‌ పరిధిలో 20 నియోజకవర్గాల్లో దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, 2-3 నెలలకొకసారి డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పొంగులేటి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.


పనులు ప్రారంభించని 4,896 ఇందిరమ్మ ఇళ్లు రద్దు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభించని ఇళ్ల కేటాయింపులను రద్దు చేయనుంది. ఈ మేరకు సోమవారం జీవో-496ను వెలువరించింది. ఇంకా పనులు మొదలుకానివి 2,958, మార్కవుట్‌ క్యాప్చర్డ్‌ కింద ఉన్న 1,938 ఇళ్లు కలిపి మొత్తం 4,896 ఇళ్ల కేటాయింపును రద్దు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఎల్‌-3 (ఇంటి మంజూరుకు అర్హులు కాని వారి) జాబితా, ఎల్‌-1 (స్థలం ఉండి, ఇల్లు మంజూరైన వారి) జాబితాలో కొన్ని చోట్ల వివిధ కారణాలతో అర్హులు.. అనర్హులుగా నమోదయ్యారు.


దాంతో వారికి ఇల్లు మంజూరైనా డబ్బు చెల్లింపులను నిలిపివేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఇల్లు మంజూరై, బేస్‌మెంట్‌, అంతకంటే పైస్థాయికి నిర్మాణమై, చెల్లింపులు ఆగిపోయిన 3,279 ఎల్‌-3, ఎల్‌-1 కేసులకు వన్‌ టైమ్‌ క్లియరెన్స్‌ కింద నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు.. నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ ఒక్కసారికే వర్తిస్తుందని, భవిష్యత్‌లో ఎల్‌-3 మంజూరుకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

50 వేలు కట్టి చేరితే రోజుకు రూ.700 ఆదాయం!
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి!
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 06:10 AM