Kamareddy: విషాదం.. నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:05 PM
కామారెడ్డిలో విషాదం నెలకొంది. మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కామారెడ్డి, జనవరి 6: మూడేళ్ల చిన్నారి అప్పటి వరకు ఆడుతూ ఉన్నాడు. బాలుడి ఆటపాటలను చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కాసేపటికే ఆ బాలుడిని మృత్యువు కబళిస్తుందని వారు ఊహించలేకపోయారు. ఆడుతూ నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారిని ప్రమాదం వెంటాడింది. కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫాంహౌస్‌లో నీటి తొట్టిలో పడి మూడేళ్ల బాలుడు రన్విత్ కుమార్ మృతి చెందాడు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ద భాస్కర్ ఫామ్ హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భాస్కర్ కుమారుడు రన్విత్ కుమార్ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడిపోయాడు. చాలా సేపటి వరకు బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఫాంహౌస్ అంతా వెతికారు.
చివరకు నీటితొట్టిలో బాలుడు పడి ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో హుటాహుటిన చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ అలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
.ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..
Read Latest Telangana News And Telugu News