ట్రావెల్స్ బస్సు బోల్తా.. 11మందికి గాయాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:50 AM
హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి.
నిద్రమత్తులో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం..
సూర్యాపేట జిల్లాలో ఘటన
మోతె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. మోతె ఎస్సై లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు 33 మంది ప్రయాణికులతో విశాఖపట్టణానికి బయలుదేరింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హుస్సేనాబాద్ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే, డ్రైవర్ నిద్రమత్తులో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలోని అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా, ముందు వరుసలో కూర్చున్న 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 11 మందిలో 9 మందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అనంతరం బుధవారం ఉదయమే ఇళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు ప్రయాణికుల కాళ్లు విరగడంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..
Read Latest AP News And Telangana News And International News And Telugu News