Share News

విద్యార్థినులపై వంట మనిషి వేధింపులు

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:29 AM

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై వంట మనిషి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థినులపై వంట మనిషి వేధింపులు

  • గురుకులం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

  • నిందితుడు పరార్‌.. పోక్సో కేసు నమోదు

అడ్డగూడూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై వంట మనిషి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో.. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 615 మంది విద్యార్థినులు చదువుతున్నారు. తుంగతుర్తి మండలం తూర్పుగూడేనికి చెందిన శ్రీరాముల వెంకన్నను మూడు నెలల క్రితం ఇక్కడ వంట మనిషిగా కాంట్రాక్టర్‌ సోమయ్య నియమించారు.


కాగా, వెంకన్న తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 18 మంది విద్యార్థినులు 12న ప్రిన్సిపాల్‌ ఝాన్సీరాణికి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె సూచించినట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థినులు విషయం చెప్పారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులతో కలసి తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ‘రూ.500, రూ.1,000 ఇస్తా.. వస్తావా’ అంటూ విద్యార్థినులతో వంట మనిషి వెంకన్న అసభ్యంగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు.


విషయం తెలుసుకున్న జిల్లా కోఆర్డినేటర్‌ సుధాకర్‌, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, రామన్నపేట సీఐ రవి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థినులతో వెంకన్న అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తించామని ఆర్డీవో తెలిపారు. ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, శాఖాపరమైన విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకన్నపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:29 AM