Share News

వేగంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:31 AM

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం రెండో దశ పనులు తొమ్మిది నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

వేగంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు
SLBC Tunnel Project

  • తొమ్మిది నెల్లల్లో ఒక కిలోమీటర్‌ తవ్వకం పూర్తి

  • ఇన్‌లెట్‌ 359 మీటర్లు, ఔట్‌లెట్‌ వైపు 644 మీటర్లు

  • జపాన్‌ నుంచి తెచ్చిన త్రీఆర్మ్‌ బూమర్‌ యంత్రాలతో పనులు

  • 8 2028 నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

బ్రహ్మగిరి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం రెండో దశ పనులు తొమ్మిది నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో కిలోమీటర్‌ సొరం గం తవ్వకాన్ని పూర్తిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత సొరంగం పనులను పూర్తిగా నిలిపివేశారు. వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం 12 మందితో నియమించిన సాంకేతిక కమిటీ సలహాలు, సూచనల మేరకు పనులు తిరిగి ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. మొదట ఔట్‌లెట్‌ టన్నెల్‌ వైపున ఫిబ్రవరి 16న, తర్వాత ఇన్‌లెట్‌ వైపున మార్చి 18న డీబీఎం పద్ధతిలో సొరంగం తవ్వక పనులను ప్రారంభించారు.


సొరంగం మొత్తం పొడవు 43.930 కిలోమీటర్లు కాగా, ప్రమాదానికి ముందు అవుట్‌లెట్‌ నుంచి 20.426 కి.మీ., ఇన్‌లెట్‌ నుంచి 13.955 కి.మీ. తవ్వకం పూర్తయింది. ఇటీవల ఇన్‌లెట్‌ నుంచి 359 మీటర్లు, అవుట్‌లెట్‌ నుంచి 644 మీటర్లు తవ్వడంతో రెండు వైపుల నుంచి కిలోమీటర్‌ తవ్వకం పనులు పూర్తయ్యాయి. ప్రమాదం జరిగే నాటికి ఇన్‌లెట్‌ నుంచి 13.955కి.మీ. సొరంగం పూర్తికాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 205 మీటర్ల వెనుకకు జరిగి, 13.750 కి.మీ. వద్ద పనులను పునర్‌ప్రారంభించారు. అక్కడి నుంచి ఎడమ వైపునకు 150 మీటర్లు మళ్లించి నేరుగా అవుట్‌లెట్‌ వైపు 21వ కి.మీ.కు అనుసంధానం చేయనున్నారు. తవ్వకంలో వేగం పెంచేందుకు జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న త్రీ ఆర్మ్‌ బూమర్‌ మిషన్‌లతో అడ్వాన్స్‌డ్‌ టన్నెలింగ్‌ మెథడ్‌ విత్‌ అబ్జర్వేషన్‌ టెక్నిక్స్‌ (ఏటీఎంఓటీ)తో ఇరువైపులా సొరంగం తవ్వకం పను లు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.


సొరంగంలో ఎటువంటి శిథిలాలు కూలకుండా ఎప్పటికప్పుడు సొరంగం పైకప్పునకు కెమికల్‌ సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు బ్రహ్మగిరి (ఇన్‌లెట్‌) నుంచి 14.109 కి.మీ., మన్నెవారిపల్లి (ఔట్‌లెట్‌) వైపు నుంచి 21.07 కి.మీ.తో కలిపి 35.18 కి.మీ.తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇంకా 8.750 కి.మీ. తవ్వాల్సివుంది. రోజుకు 6మీటర్ల వరకు తవ్వకాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి రోజుకు 14 మీటర్ల వరకు సొరంగం తవ్వకాలు జరిపేందుకు సాంకేతిక కమిటీ చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు మూడు షిప్టుల్లో 400 మంది పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 04:31 AM