భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:22 PM
భారత్‌లోని భాషా, సాంస్కృతిక వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. భారతీయ నాగరికత, భాషలు, సాంప్రదాయాలు అంతే ప్రత్యేకమైనవని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని భాషా, సాంస్కృతిక వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. భారతీయ నాగరికత, భాషలు, సాంప్రదాయాలు అంతే ప్రత్యేకమైనవని అన్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రజలు వివిధ సాంప్రదాయాలను అనుసరిస్తున్నప్పటికీ, వివిధ భాషలు మాట్లాడుతున్నప్పటికీ అందరూ కలిసిమెలిసి జీవించడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. సెర్బియా చిత్ర దర్శకుడు, రచయిత ఎమిర్ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ భారతదేశం గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు (Putin Praises India).
ఇటీవల ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు భారతదేశంలో ఎంతమంది ప్రజలు ప్రధాన భాష అయిన హిందీ మాట్లాడుతున్నారని అడిగానని, దానికి ఆయన సుమారు 60 కోట్ల మంది అని చెప్పినట్లు పుతిన్ వివరించారు. దేశ మొత్తం జనాభా ఎంత అని అడగ్గా దాదాపు 150 కోట్లు అని సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దేశ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది మాత్రమే ప్రధాన భాష మాట్లాడుతుండగా.. మిగిలిన మూడింట రెండు వంతుల మంది తమ ప్రాంతీయ భాషలను మాట్లాడుతున్నారని పుతిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు (India's Linguistic Diversity).
'ఇది అద్భుతం కాదా? నిజంగా ఆశ్చర్యకర విషయం' అంటూ భారతదేశ భాషా వైవిధ్యాన్ని ప్రశంసించారు (Unity in Diversity). భారతీయ నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటని పుతిన్ పేర్కొన్నారు. భారతదేశం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంతగా ఆసక్తి పెరుగుతోందని చెప్పారు. భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకే దేశంగా ప్రజలు కలిసి జీవించడం భారతదేశ ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..