మున్సిపోల్స్‌లో ‘సోషల్’ వార్
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:23 PM
మున్సిపల్ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో.. వారు ఇక సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని ప్రచారాలను ప్రారంఢించారు.
- సోషల్ మీడియాలో ప్రధాన పార్టీల పరస్పర ఆరోపణలు
- వార్డుల స్థాయిలో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు
మెదక్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. రోడ్లపై, వీధుల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, పార్టీ కండువాలు కప్పుకొని గల్లీల్లో ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రధాన పార్టీలు తలబడుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ వేదికగా చేసుకుని పరస్పర ఆరోపణలతో మెదక్ జిల్లాలో సోషల్ వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ అభివృద్ధి పనుల ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు ఆయా పనులు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు చేస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అసంపూర్తిగా ఉన్న పనులను ప్రస్తావిస్తూ వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ చేస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో జోరు..
మెదక్ జిల్లా కేంద్రంలో వార్డుస్థాయి యువ నాయకులతో పాటు ప్రత్యేక సోషల్ మీడియా టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఒక పార్టీ చేసిన పోస్టుకు వెంటనే కౌంటర్ పోస్టులు, ట్రోల్స్ వస్తుండడంతో రాజకీయ చర్చలు వ్యక్తిగత విమర్శల దిశగా మళ్లుతున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం వివాదస్పదంగా మారుతోంది. రాజకీయ అవగాహన కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్ చేయడం పెరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఎడిట్ చేసిన వీడియోలు, పాత ఫొటోలను తాజా సమాచారమంటూ ప్రచారం చేయడంతో యువ ఓటర్లలో గందరగోళం ఏర్పడుతోంది. వాస్తమేదైనా తమ పోస్టులు ఎంత వైరల్ అయ్యాయన్నదే ముఖ్యంగా మారింది. దీంతో వార్డడల్లో సమస్యలు పక్కకు నెట్టబడుతున్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీ హయాంలో ఏం చేశారు?
మున్సిపాలిటీల్లో గత పాలనలో జరిగిన పనులపై సోషల్ మీడియాలో వాదోపవాదాలు హోరెత్తిస్తున్నారు. మీ హయాంలో ఏం చేశారంటే... మీ హయాంలో ఏం చేస్తున్నారు.. అంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రధాన సమస్యలైన తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల గురించి చర్చ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్‌లు, ఎడిట్ చేసిన వీడియోలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్నికల అధికారులు, సైబర్ విభాగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. సోషల్ మీడియా కోడ్ అమలుపై కఠిన చర్యలు తీసుకోవలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ బ్యాలెట్‌కు ముందే డిజిటల్ బ్యాటిల్ హీటెక్కింది.
వార్డుల్లో గ్రూపులు
మున్సిపాలిటీల్లోని ఆయా పార్టీల సోషల్ మీడియా టీమ్‌లలో యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. వార్డు స్ధాయిలో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థి ఫొటోలు, వీడియోలు, నినాదాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావడానికి సోషల్ మీడియా సులువైన వేదికగా మారింది. నేరుగా నేతలతో భేటీ అవసరం లేకండా తమ అభిప్రాయాలను బయట పెట్టే అవకాశం లభిస్తోంది. అభివృద్ధి పనుల ఫొటోలు, లోపాలపై విమర్శలు ప్రభుత్వ పథకాలపై చర్చలు... అన్నీ ఇప్పుడు ఫోన్ స్ర్కీన్ మీదే జరుగుతున్నాయి. ఏదోవిధంగా యువత రాజకీయాల్లో భాగం కావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News