పోలీసుల నిర్లక్ష్యం వల్లే షాబాద్‌లో హత్యలు జరిగాయి: హరీశ్ రావు
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:25 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మానవత్వం, నైతిక బాధ్యత ఉంటే హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థగా మార్చిందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లను సెటిల్‌మెంట్ అడ్డాలుగా మార్చారని ధ్వజమెత్తారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను కట్టడి చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఉన్న శ్రద్ధ, రేపిస్టులను అరెస్టు చేయడంలో లేదని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
అత్యాచారానికి గురైన బాలికతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరినీ నిందితుడు హత్య చేశాడని హరీశ్ రావు పేర్కొన్నారు. అతని దాడి నుంచి తప్పించుకున్న దివ్యాంగురాలైన బాలికను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. వెంటనే ఆ చిన్నారి పేరిట కోటి రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె పోషణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్