Share News

సిద్దిపేటకు రూ.544 కోట్లతో అభివృద్ధి.. నూతన పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:38 PM

సిద్దిపేట జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించి రూ.544.11 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

సిద్దిపేటకు రూ.544 కోట్లతో అభివృద్ధి.. నూతన పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
CM Revanth Reddy Siddipet Works

సిద్దిపేట, నవంబర్ 19: సిద్దిపేట జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించి రూ.544.11 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలో విద్య, రెవెన్యూ, విద్యుత్ రంగాలతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఈ నిధులను కేటాయించారు.

రూ.451.13 కోట్లతో నూతన పనులకు శంకుస్థాపన

జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం రూ.451.13 కోట్లతో చేపట్టనున్న ఈ కింది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు: సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో (మొత్తం రూ.400 కోట్లు) రెండు అంతర్జాతీయ ప్రమాణాల రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం.

ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు: జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.15.44 కోట్లు.

తహసీల్దార్ కార్యాలయాలు: ఆరు నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.13.50 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లు, చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.

విద్యుత్ సబ్‌స్టేషన్లు: జనగామ నియోజకవర్గంలో మూడు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.6.89 కోట్లు.

రూ.92.98 కోట్లతో పూర్తయిన పనుల ప్రారంభోత్సవం

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న రూ.92.98 కోట్ల విలువైన ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. వాటి వివరాలు:

విద్యుత్ సబ్‌స్టేషన్లు: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్‌స్టేషన్లు.

కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి: భక్తుల సౌకర్యార్థం రూ.14.35 కోట్లతో నిర్మించిన ఆలయ సత్రం, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్.

గ్రామ సంఘాల భవనాలు: మహిళా సంఘాల బలోపేతం కోసం రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ సంఘాల భవనాలు.

కేజీబీవీ భవనం: రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (KGBV) భవనం.

విద్యుత్ డివిజన్ కార్యాలయం: గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ డివిజన్ కార్యాలయం.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (రెవెన్యూ, సమాచార శాఖ), దామోదర రాజనర్సింహా (ఆరోగ్య శాఖ), గడ్డం వివేక్ వెంకటస్వామి (గనులు, కార్మిక ఉపాధి కల్పన & జిల్లా ఇన్‌చార్జి మంత్రి), పొన్నం ప్రభాకర్ (రవాణా, బీసీ సంక్షేమ శాఖ) పాల్గొన్నారు. వీరితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వెంకటస్వామి (బెల్లంపల్లి), మేడిపెల్లి సత్యం (చొప్పదండి), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాల్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని, 'ఇందిరమ్మ చీరల పంపిణీ' కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రారంభించారు. (CM Revanth Reddy Siddipet Works)


ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బ్యాంకులకు లాభాల పంట

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..

Updated Date - Nov 19 , 2026 | 06:38 PM