Share News

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 03 , 2026 | 01:45 PM

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రం బతుకుతోందని చేవెళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిధుల లేవని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
BJP MP Konda Vishweshwar Reddy

సంగారెడ్డి, మే03: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంగారెడ్డిలో జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు‌తో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం బతుకుతోందన్నారు. రాష్ట్రంలో నిధుల లేవని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు.


కాంగ్రెస్ నేతలు చిప్ప చేతిలో పట్టుకుని నిధుల కోసం ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. వారే హైదరాబాద్‌ వచ్చి మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని పేర్కొన్నారు. మరి చిప్ప చేత పట్టుకొని ఢిల్లీకి ఎందుకు పోతున్నారో? సమాధానం చెప్పాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా నిలదీశారు. తెలంగాణకి ప్రధాని మోదీ ఏం చేశారని కొంత మంది విమర్శిస్తున్నారన్నారు. కాళేశ్వరం కూలిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఎక్కువ వరి పంట పండుతోందని వివరించారు. దేశంలోనే తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.


దేశంలోనే ఎక్కువ యూరియా తెలంగాణకు కేటాయిస్తున్నామని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. యుద్ధ సంక్షోభం కారణంగా పెట్రోల్ ధరలు తప్పనిసరిగా పెరుగుతాయన్నారు. ప్రపంచంలో పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం భారత్ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మే 10వ తేదీ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ సారి బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయన్నారు. వీటితో దేశవ్యాప్తంగా సంబరాలు మార్మోగడం ఖాయమని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - May 03 , 2026 | 01:56 PM