Share News

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:29 PM

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్‌లు జరుగుతున్నాయి.

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

సంగారెడ్డి, ఫిబ్రవరి16: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్‌లు జరుగుతున్నాయి. ఈస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితోపాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ మమత.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 8వ వార్డు కౌన్సిలర్‌గా మాధవి నరేందర్ రెడ్డి గెలిచారు. అనంతరం ఆమె బీఆర్ఎస్ గూటికి చేరారు. స్వతంత్రులుగా గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కౌన్సిలర్ ఒకరు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇస్నాపూర్‌ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు 14, కాంగ్రెస్ ఓట్లు 12కు చేరాయి.


అమరచింత.. అమనగల్..

వనపర్తి జిల్లా అమరచింతలో ఉత్కంఠ నెలకొంది. ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ వార్డు కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. ఇక అమన్‌గల్‌లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పత్యానాయక్‌.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో చైర్మన్‌గా పత్యానాయక్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.


ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు..

బైంసాలో ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయి. చైర్మన్ పదవి కోసం ఎంఐఎం పోటీ పడుతోంది. దాంతో ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి.


ఎర్రబెల్లి భార్య హల్‌చల్..

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మున్సిపాలిటీ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ వర్గీయులు నినాదాలు. ప్రతిగా ఎంపీ కడియం కావ్య ఓటు వేయడానికి వీల్లేదంటూ బీఆర్ఎస్ వర్గీయులు నిరసన చేపట్టారు. ఆ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భార్య ఉషా హల్‌చల్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో స్థానికంగా 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు.


ఆదిలాబాద్‌లో వింత పరిస్థితి..

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ బీజేపీకి దక్కకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులు మీద ఎత్తులు వేస్తోంది. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు ఒక తాటిపైకి వచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అనూష పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఎంఐఎంకు వైస్ చైర్మన్, బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన వారికి కో- ఆప్షన్ పదవులు ఇవ్వాలంటూ ఈ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.


వింత పరిస్థితి..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో గెలిచిన పలువురు కౌన్సిలర్లు కనిపించడం లేదని వారి వారి కుటుంబసభ్యుల సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం భారీ నిరసన చేపట్టారు.


అత్తాకోడళ్ల సవాల్..

నారాయణపేట మున్సిపల్ కార్యాలయానికి ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటు వేసేందుకు వచ్చారు. బీజేపీకి మద్దతుగా ఓటు వేయడానికి ఎంపీ డీకే అరుణ వచ్చారు. అయితే నారాయణపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. దాంతో ఈ పీఠం ఏ పార్టీ ఖాతాలో పడుతుందనేది సస్పెన్స్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

For More TG News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 01:33 PM