‘నీది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్’.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
ABN , Publish Date - May 25 , 2026 | 10:53 AM
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. యూరియా, సాగునీరు, కరెంట్ సరఫరా, పండిన పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులు ఇంత బాధపడటం మొట్టమొదటి సారి చూస్తున్నామన్నారు.
సిద్దిపేట, మే 25: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వరి ధాన్యాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు. యూరియా, సాగునీరు, కరెంట్ సరఫరా, పండిన పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులు ఇంత బాధపడటం మొట్టమొదటి సారి చూస్తున్నామన్నారు. గతంలో ఈ ప్రభుత్వం ఉన్నా ఇట్లాంటి దుర్భర పరిస్థితులు ఎదురు కాలేదని చెప్పుకొచ్చారు. ‘ఉత్తమ్ నీది నోరా మోరా.. మొన్న 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం అని చెప్పి ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం అనడం ఎంతవరకు సబబు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టడం కాదని.. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యంలో 70 లక్షలు కొంటే మిగతా ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలని మాజీ మంత్రి ప్రశ్నించారు. తాలు పెడితే తోలు తీస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. సిద్దిపేట నియోజకవర్గంలో క్వింటాల్‌కు 5 కిలోలు తరుగు తీస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని విమర్శించారు. రోహిణి కార్తె వచ్చినా కళ్లాల్లోనే ధాన్యం, రైతులు ఉన్న పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నదని తెలిపారు. రైతులు గుండెలు బాదుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కళ్లు కనబడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. వరి కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 మంది రైతులు ప్రాణాలు వదిలారని హరీశ్ రావు తెలిపారు. ‘మిషన్ మోడ్‌లో వడ్లు కొనాలని రేవంత్ అంటున్నారు. నీది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్. నిన్న కేబినెట్ మీటింగ్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు ఆదేశాలు ఇస్తారని రైతులు ఆశించారు. రైతుల ఆశలు నిరాశ అయ్యాయి. 45 రోజుల్లో మొత్తం రైతుబంధు వేస్తానని చెప్పి 60 రోజులు గడిచినా వేయలేదు. రేవంత్ రెడ్డి కేవలం పేపర్ టైగర్ మాత్రమే... దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రకం నువ్వు. ఢిల్లీ ట్రిప్పులు మాని.. లారీల ట్రిప్పులు పెంచు. ఒకటి, రెండు రోజుల్లో మార్పు రాకుండే స్వయంగా నేనే కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నా చేపడతా. వేలాది మంది రైతులతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌లను దిగ్బంధిస్తాం. రాజకీయ విమర్శలు మాని పరిష్కార మార్గాలు చూడండి’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి...
ఆయిల్ కంపెనీల తీరుపై పెట్రోల్ బంక్ యజమానుల ఆగ్రహం
అర్ధరాత్రి పోలీస్ గస్తీకి సుస్తీ
Read Latest Telangana News And Telugu News