Share News

అర్ధరాత్రి పోలీస్ గస్తీకి సుస్తీ

ABN , Publish Date - May 25 , 2026 | 10:04 AM

మెట్రోపాలిటన్ సిటీలో రాత్రి 11 దాటిందంటే చాలు పలు ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్లడానికి నగరవాసులు, ముఖ్యంగా మహిళలు భయపడే పరిస్థితులు ఉన్నా యి. పోకిరీలు, ఆకతాయిల గుంపులు రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు కోకొల్లలు.

అర్ధరాత్రి పోలీస్ గస్తీకి సుస్తీ
Hyderabad Police

హైదరాబాద్: మెట్రోపాలిటన్ సిటీలో రాత్రి 11 దాటిందంటే చాలు పలు ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్లడానికి నగరవాసులు, ముఖ్యంగా మహిళలు భయపడే పరిస్థితులు ఉన్నా యి. పోకిరీలు, ఆకతాయిల గుంపులు రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు కోకొల్లలు. అర్ధరాత్రి మహిళలకు భద్రత లేదన్న విషయం ఇటీవల మహిళా పోలీస్ కమిషనర్ సుమతి విషయంలోనే నిరూపణ అయ్యింది. అర్ధరాత్రి ఒంటరిగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మహిళా పోలీస్ కమిషనర్‌ను సుమారు 40 మంది పోకిరీల గుంపు చుట్టుముట్టి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. సుమారు 3 గంటలపాటు ధైర్యంగా సీపీ ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినప్పటికీ ఏ ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు వచ్చి గస్తీ నిర్వహించకపోవడం గమనార్హం.


ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక కాలనీలు, బస్తీలు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మహిళా పోలీస్ కమిషనర్ సుమతి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన ప్రదేశాల్లో ఆ మరుసటి రోజు కూడా పెట్రోలింగ్ వాహనాల గస్తీ కనిపించకపోవడం గమనార్హం. ఎప్పటిలాగే పోకిరీల గుంపులు యథేచ్ఛగా, ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతున్నాయి. లోపం ఎక్కుడుందనేది స్థానిక పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారులకే తెలియాలి.


నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా ఏది..?

ఇటీవల పలు కమిషనరేట్లలో పోలీసులు వారాంతంలో అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిర్మానుష్య ప్రాంతాలు, హాట్ స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న వారిని, మద్యం తాగుతూ రోడ్ల వెంట ఖాళీగా కాలక్షేపం చేస్తున్న అల్లరిమూకలను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు. అది నిరంతరాయంగా కొనసాగితే పరిస్థితి వేరేలా ఉండేది. కనీసం పోకిరీలు, రౌడీమూకలు రోడ్లపై తిరగకుండా పోలీసులు కట్టడి చేసేవారు. కేవలం ఒకటి రెండు వారాలు మాత్రమే వారాంతపు గస్తీలు నిర్వహించిన పోలీసులు ఆ తర్వాత దానికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పోలీస్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని, అర్ధరాత్రి గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


వసూళ్లకే అధిక ప్రాధాన్యం

పోలీసులు కార్డన్ సెర్చ్, ఆపరేషన్ ఛబుత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నా.. నేరస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రాత్రిపూట గస్తీ నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధులను పక్కన బెట్టి, అక్రమ వసూళ్ల బాటపడుతున్నారు. రాత్రి పది నుంచి తెల్లవారుజామున 2:30 గంటల వరకు రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారి నుంచి మామూళ్లకు ఎగబడుతున్నారు. దాంతో ట్రై కమిషనరేట్ పరిధిలో నిఘా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో రోగికి.. చైనా నుంచి సర్జరీ

ఆయిల్ కంపెనీల తీరుపై పెట్రోల్ బంక్ యజమానుల ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 25 , 2026 | 10:08 AM