Share News

హైదరాబాద్‌లో రోగికి.. చైనా నుంచి సర్జరీ

ABN , Publish Date - May 25 , 2026 | 05:41 AM

ఆధునిక వైద్య సాంకేతికేత దేశాల మధ్య దూరాన్ని చెరిపేస్తోంది. సర్జరీలకు సరిహద్దులు ఉండవని వైద్యనిపుణులు నిరూపించారు. ఎక్కడో 7 వేల కిలోమీటర్లకు పైగా దూరాన...

హైదరాబాద్‌లో రోగికి.. చైనా నుంచి సర్జరీ

  • వూహాన్‌లోని టోంగ్జి ఆస్పత్రిలో భారతీయ వైద్యుడు.. భాగ్యనగరంలోని ఏఐఎన్‌యూలో 63 ఏళ్ల పేషెంట్‌

  • అక్కణ్నుంచే యురేటరల్‌ రీ-ఇంప్లాంటేషన్‌సర్జరీని 90 నిమిషాల్లో పూర్తిచేసిన డాక్టర్‌ మహ్మద్‌ గౌస్‌

  • 7 వేల కి.మీ. దూరంలోని 2 ఆస్పత్రుల మధ్య సాంకేతిక అనుసంధానం

  • రోబోటిక్స్‌, అత్యంత వేగవంతమైన 5జీ ఇంటర్‌నెట్‌తో సాధ్యం

హైదరాబాద్‌ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆధునిక వైద్య సాంకేతికేత దేశాల మధ్య దూరాన్ని చెరిపేస్తోంది. సర్జరీలకు సరిహద్దులు ఉండవని వైద్యనిపుణులు నిరూపించారు. ఎక్కడో 7 వేల కిలోమీటర్లకు పైగా దూరాన, చైనాలోని వూహాన్‌ నగరంలో ఉన్న ఓ భారతీయ వైద్యుడు.. ఇక్కడ హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రిలోని పేషెంట్‌కు క్లిష్టమైన రోబోటిక్‌ శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడడమే ఇందుకు రుజువు. అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీ, వేగవంతమైన 5జీ ఇంటర్‌నెట్‌ సదుపాయంతో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ (63) మూత్రాశయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఏఐఎన్‌యూ వైద్యులను సంప్రదించారు. అదే సమయంలో.. ఆస్పత్రికి చెందిన యూరాలజిస్టు డాక్టర్‌ సయ్యద్‌ మహ్మద్‌ గౌస్‌.. వూహాన్‌లోని టోంగ్జీలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ హెపటో పాంక్రియాటో బైలియరీ అసోసియేషన్‌’ చైనీస్‌ చాప్టర్‌ 10వ కాంగ్రెస్‌కు హాజరయ్యారు. ఆ సదస్సులో.. కొత్తగా వచ్చిన రోబోటిక్‌ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందో అక్కడికి వచ్చిన వైద్యనిపుణులందరికీ చూపించడానికి లైవ్‌గా 26 ఆపరేషన్లు చేశారు. వాటిలో ఐదు.. అక్కణ్నుంచీ విదేశాల్లో ఉన్న పేషెంట్లకు చేసినవి. ఆ ఐదింటిలో ఒకటి.. డాక్టర్‌ సయ్యద్‌ మహ్మద్‌ గౌస్‌ చేసిన ‘యురేటరల్‌ రీ-ఇంప్లాంటేషన్‌’ సర్జరీ.


శస్త్రచికిత్స ఇలా..

వుహాన్‌లోని టోంగ్జి ఆస్పత్రి వైద్య బృందం, డాక్టర్‌ గౌస్‌.. ఇక్కడ హైదరాబాద్‌ వైద్యులు.. అంతా కలిసి సమన్వయంతో ఈ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్సకు ముందు రెండు నగరాల్లోని వైద్యులూ రోగి వైద్య చరిత్ర, స్కానింగ్‌ నివేదికలను క్షుణ్నంగా పరిశీలించారు. టోంగ్జి ఆస్పత్రిలోని రోబోటిక్‌ సిస్టమ్‌కు హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యులోని రోబోటిక్‌ వ్యవస్థను అనుసంధానం చేశారు. రోబోటిక్‌ చేతుల కదలికలకు సంబంధించిన మార్గదర్శకాలను ముందుగానే రూపొందించారు. తర్వాత హైదరాబాద్‌ వైద్యులు రోగికి మత్తుమందు ఇచ్చి, ఆపరేషన్‌ థియేటర్‌లో రోబోటిక్‌ పరికరాలను సిద్ధం చేశారు. రోబోటిక్‌ వ్యవస్థలో అమర్చిన అత్యాధునిక 3డి కెమెరాలు ఇక్కడి దృశ్యాలను వూహాన్‌లోని డాక్టర్‌ గౌస్‌కు ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాయి. అక్కడ ఆయన ఒక ప్రత్యేక కన్సోల్‌ వద్ద కూర్చొని రోబోటిక్‌ చేతులను నియంత్రిస్తూ.. హైదరాబాద్‌లోని రోగికి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 5జీ నెట్‌వర్క్‌ సాయంతో కేవలం 200 మిల్లీసెకన్లలోనే ఆదేశాలు చేరడంతో రోబోటిక్‌ చేతులు వైద్యుడి చేతి కదలికలను వెంటనే అనుసరించాయి. దీంతో ఆపరేషన్‌ అత్యంత కచ్చితత్వంతో సాగిందని.. 90 నిమిషాల్లో పూర్తయిందని వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సర్జరీని కొనసాగించడానికి వీలుగా.. శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపూ హైదరాబాద్‌ వైద్య బృందం ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉంది. భవిష్యత్తులో దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో.. ఈ తరహా రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

Updated Date - May 25 , 2026 | 05:51 AM