గ్రాసం గోస!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:07 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు పశు పోషణ పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడంతో పచ్చిగడ్డి లభ్యత లేకుండా పోగా.. వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో ఎండుగడ్డికి కూడా కష్టాలు వచ్చిపడ్డాయి.
కరువుతో పశువుల మేతకు కష్టాలు
ఎల్‌నినోతో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన వరిసాగు విస్తీర్ణం
వర్షాలు లేకపోవడంతో కేవలం నెలరోజులే పచ్చిమేత లభ్యం
ఇప్పుడు ట్రాక్టర్ లోడ్‌కు రూ.6 వేలు
కూలి, ట్రాక్టర్ కిరాయి కలుపుకొంటే రూ.12 వేలపైనే వ్యయం
మహబూబ్‌నగర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు పశు పోషణ పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడంతో పచ్చిగడ్డి లభ్యత లేకుండా పోగా.. వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో ఎండుగడ్డికి కూడా కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటిదాకా తక్కువ ధరకే దొరికిన వరిగడ్డిని పాడి రైతులు ఇప్పుడు పెద్దమొత్తంలో ధర పెట్టి కొనుగోలు చేయాల్సివస్తోంది. గత సంవత్సరం వరకు వరికోతల తర్వాత.. పాడి ఉన్న రైతులు ఆ గడ్డిని తమ వద్దే కుప్పలుగా పెట్టుకునేవారు. పాడిలేని రైతులైతే గడ్డిని అలాగే వదిలేసి తర్వాతి సీజన్లో దానికి నిప్పు పెట్టేవారు.
అవసరమైతే పాడి రైతులకు ఉచితంగా ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. జీవాలకు మేతగా ఇప్పుడు వరిగడ్డి మాత్రమే దిక్కవడంతో.. గతంలో పాడి ఉన్నవారికి ఉచితంగా ఇచ్చిన రైతులు.. నేడు గడ్డిని అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం పశువుల సంఖ్య 3.26 కోట్లుగా ఉంది. దీనికి ఫౌల్ర్టీ అదనం. వెనుకటి రోజులతో పోలిస్తే ఎద్దుల సంఖ్య తగ్గినా పాడి పశువుల సంఖ్య మాత్రం గణనీయంగానే ఉంది. ఆవులు 42.33 లక్షలు ఉండగా, గేదెలు 42.26 లక్షలు, గొర్రెలు 1.90 కోట్లు, మేకలు 49.35 లక్షలు ఉన్నాయి. వీటికి ప్రధాన ఆహా రం పచ్చిగడ్డి, వరిగడ్డి మాత్రమే. పాడి పశువులకు దాణా ఇస్తున్నప్పటికీ దానినే మొత్తంగా ఇవ్వలేరు. వరి, మొక్కజొన్న నుంచే దాదాపు 52.77 శాతం మేత అందుతోంది. పచ్చిక మైదానాలు, మేతకు ఉపయోగపడే పంటలు అన్నీ కలిపి 25 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, ఖరీఫ్ సీజన్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో నెలరోజులు మాత్రమే పచ్చిక మైదానాల్లో మేత దొరికింది. మిగతా సమయంలో రైతులు స్వతహాగా సాగుచేసిన జొన్న, నేపియర్, మొక్కజొన్న, పిల్లి పెసర తదితరాలు ఇవ్వాల్సి వస్తోంది.
వరిసాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో..
పశువుల మేతగా అత్యధిక మొత్తంలో అవసరమయ్యే వరిగడ్డికి గతంలో కొరత ఉండేది కాదు. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతఏడాది వానాకాలంలో 67.5 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, ఈ ఏడాది 57 లక్షల ఎకరా ల్లో సాగు చేశారు. ఇందులోనూ సగటున 10 నుంచి 15 శాతం వరకు ఎండిపోయిన పరిస్థితి. మరో ప్రధాన మేత వనరు అయిన మొక్కజొన్న సాగు కూడా 7 లక్ష ల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాలకు పడిపోయింది. దీంతో రైతులు వరిగడ్డి కొనుగోలుపై దృష్టి పెట్టారు. గతంలో వృధాగా వదిలేసిన వరిగడ్డిని ఇప్పుడు రైతు లు ఒక ట్రాక్టర్ ట్రిప్పును దాదాపు రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. దీనికి.. కూలి, ట్రాక్టర్ ఖర్చు, కట్టలు కట్టే యంత్రం ఖర్చు కూడా కలిపితే వరిగడ్డి కొనుగోలు చేసినవారు తీసుకుపోయే దూరాన్ని బట్టి రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వ్యయం అవుతోంది.
కర్ణాటక నుంచి కూడా రైతులు సరిహద్దున ఉన్న నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వచ్చి వరిగడ్డి కొనుగోలు చేస్తున్నారు. ఇక మేత లభ్యత లేకపోవడంతో గొర్రెల కాపరులు కూడా దూరప్రాంతాలకు మందలను తోలుకొని వలస వెళుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మేకల కంటే గొర్రెల సంఖ్య అధికంగా ఉండటంతో గడ్డి అవసరం ఎక్కువగా ఉంది. పచ్చిమేత లేకపోవడంవల్ల పాల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక గేదె పచ్చిగడ్డి వేస్తే 3 లీటర్ల పాలు ఇస్తుందనుకుంటే.. ఎండుగడ్డి తినడం వల్ల 2 లీటర్ల నుంచి 2.5 లీటర్లు మాత్రమే పాలు ఇస్తుంది. దీనివల్ల పాల కొరత కూడా ఏర్పడే పరిస్థితులున్నాయి.
ప్రత్యామ్నాయ ప్రణాళికలేవీ?
వేసవిలో తాగునీటి కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి ఉంచింది. పవర్ బోర్లకు మరమ్మతు చేయడం వంటివి కూడా చేస్తోంది. అయితే పాడి పశువుల విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు అత్యంత వేగంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం గడ్డి పెంపకందారులకు రెండు పథకాలను అమలు చేస్తుండగా.. వాటిపై అవగాహన కల్పించడంలో వైఫల్యం కనిపిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రెండున్నర ఎకరాల్లో పశుగ్రాసం పెంచితే రూ.55 వేలు ఉచితంగా ఇస్తారు. అలాగే వీబీజీరామ్‌జీ పథకంలో 8 ఎకరాల్లో పశుగ్రాసం పెంచితే రూ.14 వేలు ఇస్తారు.
అయితే వీటిపై జిల్లా స్థాయిల్లో అధికారులు ప్రతిపాదనలు పంపినా మంజూ రు రావడంలేదు. అలాగే పశుగ్రాసం విత్తనాలపై కూడా 75 శాతం సబ్సిడీ ఉండగా.. ఆ విత్తనాలు కూడా ఇప్పటివరకు సరఫరా కాలేదు. మరో 15 రోజుల్లో విత్తనాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. గతంలో దశాబ్దం క్రితం 2016లో కూడా కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వం శైలేజీ పంపిణీ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దమొత్తంలో ఇప్పుడే ఇండెంట్ పెట్టడం ద్వారా వేసవిలో మేతకు ఇబ్బందులు ఏర్పడితే శైలేజీని అందించవచ్చనే అభిప్రాయం ఉంది.
పశు పోషణ భారంగా మారింది
చాలా ఏళ్లుగా పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు పశువుల పోషణ భారంగా మారింది. గడ్డి దొరకకపోవడంతో ఉన్న ఆరు ఆవులకుగాను ప్రస్తుతం రూ.25 వేల వరిగడ్డి కొనుగోలు చేశాను. ఇంతకుముందు 60 నుంచి 65 లీటర్ల పాలు రోజూ డెయిరీకి పోసేవాడిని. ఇప్పుడు కేవలం 30 నుంచి 25 లీటర్లు మాత్రమే పోస్తున్నాను. మరోవైపు దాణా రేట్లు కూడా పెరిగిపోయాయి. గతంలో 50 కిలోల దాణా రూ.1500 వరకు వచ్చేది. ఇప్పుడు రూ. 2 వేల నుంచి రూ.2300 వరకు ధర పెరిగింది.
- అల్వాల్, పాడి రైతు, వెల్దండ,
నాగర్‌కర్నూలు జిల్లా
రూ.40 వేలు ఖర్చయింది
నా దగ్గర 15 గేదెలు ఉన్నాయి. గతంలో రూ.5 వేలతో గడ్డి కొనుగోలు చేసేవాడిని. ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 14 ఎకరాల గడ్డిని రూ.20 వేలతో కొనుగోలు చేశాను. వాటిని కట్టలు కట్టడానికి రూ.20 వేలు అయింది. గడ్డిని ఇంటికి తీసుకురావడానికి ట్రాక్టర్, కూలీల ఖర్చుతో కలిపి మరో రూ.18 వేలు అయింది. గతంలో ఎప్పుడూ గడ్డి కొనుగోలుకు ఇంత ఖర్చు కాలేదు. బంధువులెవరైనా ఉంటే ఉచితంగా తెచ్చుకునేవాళ్లం.
- శ్రీనివాస్, రైతు, సింగారం,
నారాయణపేట జిల్లా
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News