Tummala Nageshwar Rao: పార్క్‌కు ఆ మహనీయుడి పేరు పెట్టడం సంతోషంగా ఉంది: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jan 11 , 2026 | 08:40 PM
ఖమ్మంలో పార్క్‌కు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నగర ప్రజలు సహకరిస్తే ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకు వస్తామన్నారు.
ఖమ్మం, జనవరి 11: తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్టీఆర్ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ పార్క్‌కు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగర ప్రజలు సహకరిస్తే ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ జిల్లాలో మంచి అధికారులు ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు ఎక్కడా అన్యాయం జరగటానికి వీలులేదని అధికారులకు గతంలోనే స్పష్టం చేశామని చెప్పుకొచ్చారు.
రహదారులు విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని అందుకు ప్రజలు అధికారులకు సహకరించాలంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే డ్రైన్ల నిర్మాణానికి సైతం తాము సిద్ధంగా ఉన్నామని.. ప్రజలు సహకరిస్తే పనులు వెంటనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో అన్ని కాలనీల్లో గతంలో వేల ఇళ్ల నిర్మాణం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం నివాసయోగ్యమైన నగరంగా ఉందని ఈ సందర్భంగా వివరించారు.
ఖమ్మం పరిసర ప్రాంతాలకు అన్ని జాతీయ రహదారులను తీసుకువచ్చామని చెప్పారు. రానున్న రోజుల్లో ఖమ్మం నుంచి రాజమహేంద్రవరానికి గంటన్నరలో వెళ్లతారని చెప్పారు. స్వార్థం, స్వలాభం కోసం అభివృద్ధికి అడ్డుపడితే నష్టపోతామంటూ నగర ప్రజలకు మంత్రి హితవు పలికారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకర వాతావరణం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు.
హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. నగర కార్పొరేటర్ల కోరిక మేరకు ఖమ్మం నగరాభివృద్దికి ముఖ్యమంత్రి నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మార్చిలోపు ముఖ్యమంత్రిని ఒప్పించి అభివృద్దికి నిధులు తీసుకువస్తానని నగర ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండేళ్లలో చేసిన మోసం చాలు.. పాలనపై దృష్టి పెట్టు: సీఎంకు కేటీఆర్ హితవు
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More TG News And Telugu News