Share News

కరువు కాలంలో ఆదుకున్న సీతారామ!

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:00 AM

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటకు ఢోకా లేకుండా నీరు అందింది.

కరువు కాలంలో ఆదుకున్న సీతారామ!
Thummala Nageswara Rao

  • గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం..

  • ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగర్‌ ఎడమ కాలువకు నీరు

  • ‘సాగర్‌’ ఆయకట్టు పరిధిలో 2.5 లక్షలపైగా ఎకరాల్లో సాగు

  • వర్షాభావ పరిస్థితులను అధిగమించి సాగు చేపట్టిన రైతులు

  • మంత్రి తుమ్మల చొరవతో తాగునీటికీ ఇబ్బందుల్లేకుండా చర్యలు

ఖమ్మం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటకు ఢోకా లేకుండా నీరు అందింది. సీతారామ ఎత్తిపోతల పథకం.. సాగర్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో జూలై 7వ తేదీనే సీతారామ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయగా, ఏన్కూరు రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగర్‌ ఎడమ కాలువకు, అక్కడి నుంచి ఆయకట్టుకు నీరు అందించగలిగారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు కూడా ఏన్కూరు లింక్‌కెనాల్‌ ద్వారా గోదావరి నీరు అందించవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్లారు.


రూ.100కోట్లు మంజూరు చేయించి సకాలంలో పనులు పూర్తి చేయించారు. అసంపూర్తిగా వదిలేసిన విద్యుత్‌ మోటర్లను బిగించి పనులు పూర్తి చేయడంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది. 2024 ఆగస్టు 15న ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. డిస్ర్టిబ్యూటరీ కెనాల్స్‌తోపాటు పాలేరు లింక్‌కెనాల్‌ పనులు కొనసాగుతున్నాయి. అయితే, జూలూరుపాడు మండలం వినోభానగర్‌ వరకు 108కి.మీ.వరకు తవ్వి ఉన్న ప్రధాన కాలువ నుంచి మరో 9 కి.మీ మేర లింక్‌ కెనాల్‌ తవ్వడంతో సాగర్‌ ఎడమకాలవకు గోదావరి జలాలు అనుసంధానమయ్యాయి. వృథాగా పోతున్న గోదావరి జలాల నుంచి మొత్తం 9టీఎంసీలను సీతారామ ద్వారా సాగర్‌ ఆయకట్టుకు మళ్లించారు.


తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేయగలిగారు. అలాగే, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర కూరగాయల పంటలకూ నీరు అందింది. అంతేకాదు.. సీతారామకు సంబంధించిన ప్రధాన కాలువ ఉన్న 108 కి.మీ. పొడవునా, ఏన్కూరు నుంచి సాగర్‌ కెనాల్‌ దాకా 70కిలోమీటర్ల పొడవునా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావులు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు.. గోదావరి జలాలను మున్నేరుకు అనుసంధానం చేసేలా మంత్రి తుమ్మల చొరవతో ప్రణాళిక సిద్ధం చేశారు.


సాగర్‌ నుంచి తాగునీటి లభ్యత లేకపోతే గోదావరి జలాలను ఏన్కూరు నుంచి రివర్స్‌లో వీ.వెంకటాయపాలెం డీప్‌కట్‌కు రప్పించి మంచుకొండ ఎత్తిపోతల ద్వారా మున్నేరుకు అనుసంధానం చేయబోతున్నారు. ఖమ్మం నగరానికి మున్నేరు నుంచి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే, బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉండగా, మరో టీఎంసీ నీరు నిల్వ ఉంచేలా ప్రస్తుతం ఉన్న 5మీటర్ల ఎత్తును మరో మీటరు మేర పెంచుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఇసుక బస్తాలతో ఆనకట్ట ఎత్తు పెంచుతున్నారు. అదనపు టీఎంసీ నీటితో ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది.


కరువు కాలంలోనూ పంట పండింది

గోదావరి జలాలతో సాగర్‌ ఆయకట్టుకు నీరు ముందుగా వదలడంతో కరువు కాలంలో వరి పంట పండించాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో గోదావరి జలాలు సాగర్‌ ఆయకట్టుకు జూలైలోనే వచ్చాయి. వర్షాలు కురవక పోయినా సకాలంలో వరినాట్లు వేసి పంట పండించాం.

- మేకల కృష్ణ, కల్లూరు,

ఖమ్మం జిల్లా

పత్తి, మిర్చి సాగు చేసుకున్నాం

సీతారామ ఎత్తిపోతల పథకం నీరు సాగర్‌ ఆయకుట్టకు అనుసంధానం చేయడంతో అన్నదాతల కష్టాలు తీరాయి. ఈ సీజన్‌లో వరి, పత్తి, మిర్చి పం టలు సాగు చేసుకున్నాం. నేను 14 ఎకరాల్లో పంటలు వేశా. ఈ నీరే లేకపోతే ఈసారి వ్యవసాయం ఇబ్బందుల్లో పడేది.

- తోట వెంకటయ్య,

నర్సింహారావుపేట, తల్లాడ మండలం

సీతారామ నుంచి నీరు రావడంతో ముందే నాట్లు

సీతారామ ద్వారా నీరు వదలడంతో ఈ సారి ముందే వరినాట్లు వేశాం. మా గ్రామానికి సమీపంలోనే 2,500 ఎకరాలు వరిపంట పండించగలిగాం. యాసంగిలోనూ నీరు అందిస్తే ఆరుతడి పంటలు వేసుకుంటాం.

- నరుకుళ్ల అప్పాజి, అయ్యన్నపాలెం,

చండ్రుగొండ మండలం


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 05:06 AM