Share News

పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు.. గుమ్మడి నర్సయ్య ఫైర్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:40 PM

సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.

పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు.. గుమ్మడి నర్సయ్య ఫైర్..
Former MLA Gummadi Narsaiah

ఖమ్మం జిల్లా: సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు. అలాంటి తమపై అక్రమ కేసులు పెట్టడం తప్పంటూ ఆగ్రహించారు. ఖమ్మంలోని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కార్యాలయంలో పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.


రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటా..?

ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. 'పోటు రంగారావుపై రాజద్రోహ కుట్ర కేసు ఎలా పెడతారు?. అక్రమ కేసులపై భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రజాస్వామ్య దేశం అంటూనే ప్రజలు, ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై అణచివేతకు పాల్పడుతున్నారు. నక్సల్స్ రహిత దేశంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం దానికి సాక్ష్యం. ఎంపీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. సాయిబాబా అనే వికలాంగుడిని, వరవరరావును, జర్నలిస్టు మేధావులపైనా ఎన్నో అక్రమ కేసులు బనాయించారు. ఇదేనా మన ప్రజాస్వామ్యం. దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయి. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి.


ధనిక వర్గాలకే ప్రజాస్వామ్యమా..?

కేసు వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎన్ఐఏ ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలి. కమ్యూనిస్టులు కుట్రదారులు కాదు. తమ అభిప్రాయాలను దాచుకోరు. ధనిక వర్గాలకే ప్రజాస్వామ్యం నడుస్తోంది. దశాబ్దాల కాలం నుంచి మా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నాం. మేము ఎక్కడా కుట్రలు చేయలేదు. మాపై ఉన్న పోడు భూముల కేసులు, ఉద్యమ కేసులన్నీ కొట్టివేశారు. అయినా నిన్న మా స్వగ్రామం సూర్యాపేట జిల్లాలో మా ఇంటికి రిజిస్టర్ పోస్టు పంపారు. ఉపా, అక్రమ ఆయుధాల కేసు ఉందని.. విచారణకు రావాలని ఆ లేఖ సారాంశం. మా జీవితం ప్రజలకు, ప్రజా పోరాటాలకు అంకితం. అత్యున్నత న్యాయస్థానం క్రైస్తవులకు రిజర్వేషన్లు చెల్లవని తీర్పునిస్తే దాన్ని ఖండించాం. పౌర హక్కులను కాలరాయెుద్దని అన్నాం. ఇది ముమ్మాటికి గొంతు నొక్కే కుట్ర.


అక్రమ కేసులు పెడతారా..?

నాపై ఉపాతోపాటు సెడిషన్ యాక్ట్ పెట్టారు. ఇటీవల కాలంలో గాదె ఇన్నయ్య అరెస్టయినప్పుడు తప్పు అన్నాం. అందుకే కేసు పెట్టారని మా భావన. మాట్లాడే వారు లేకుండా చేయాలనే ఈ తప్పుడు నోటీసు. అడవిలో నక్సలైట్లు అయిపోయారు.. అర్బన్ నక్సలైట్ల పేరుతో మమ్మల్ని అంతం చేయాలనా మీ కుట్రలు. ఇలా చేస్తే ఎలా ప్రజాస్వామ్యం అమలవుతుంది. జర్నలిస్టుల మీదా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది ముమ్మాటికీ కమ్యూనిస్టులను బ్లాక్ మెయిల్ చేయడమే. మీరు ఎన్ని కుట్రలు, అక్రమ కేసులు పెట్టినా మా పంథా మార్చుకోం. మాది త్యాగాల పునాది మీద ఏర్పడ్డ పార్టీ, వారి ఆశయాల సాధన కోసం ముందుకు వెళ్తూనే ఉంటాం. చివరి శ్వాస వరకూ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటాం. కేసులను చట్టబద్ధంగా, పోరాటాల ద్వారా ఎదుర్కొంటాం. ఎన్ఐఏ విచారణకు పూర్తిగా సహకరిస్తాం' అని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

Updated Date - Apr 08 , 2026 | 08:42 PM