Share News

తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్

ABN , Publish Date - Jun 17 , 2026 | 01:40 PM

కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారన్నారు.

తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్
KTR

ఖమ్మం జిల్లా, జూన్ 17: ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. పాలేరు నియోజకవర్గం వెంకటగిరిలో SIRపై కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం లేదని.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ మంత్రులు ఆయనను మించిపోయారంటూ దుయ్యబట్టారు. రెవెన్యూ మంత్రి అవినీతికి హద్దు లేకుండా పోయిందని ఆరోపించారు.


వ్యవసాయం సంక్షోభంలోకి పోతే పట్టించుకున్న దిక్కు లేదని కేటీఆర్ విమర్శించారు. ఆర్థిక మంత్రి కమీషన్లకు అక్రమాలకు అంతం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని.. వారికి కనీసం యూరియా ఇచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పు.. కాళేశ్వరం, భక్తరామదాసు, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమని స్పష్టం చేశారు. పేద విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.


బూత్‌ల వారీగా బలమైన కార్యకర్తల నిర్మాణం జరగాలని కేటీఆర్ అన్నారు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని.. దేశంలో ఇప్పటికి 13 సార్లు SIR జరిగిందని.. ఇప్పుడు 14వ సారి అని తెలిపారు. SIRను పట్టించుకోక పోతే నష్టం తప్పదన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల(జులై) 25 వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి బూత్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్క అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఇది చాలా కీలకమైన సమయమని, ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాలన్నారు. ‘నిజాయతీగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ ఈరోజు 100 సీట్లతో గెలుస్తారు.. నిజాయతీగా గెలవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు తాతా మధు, పువ్వాడ అజయ్, కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

టీపీఎస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 03:22 PM