Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

ABN , Publish Date - Jun 17 , 2026 | 01:07 PM

రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy

రంగారెడ్డి, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ స్కూల్‌ను సర్కార్ నిర్మించింది. స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఆరుట్ల పాఠశాలను పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మించామని తెలిపారు. విద్యాశాఖపై ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.


విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదన్నారు. విద్య ఖర్చు కాదని.. పెట్టుబడి అని చెప్పుకొచ్చారు. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌, సీఎంలు అయినవాళ్లు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలని అన్నారు.


గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్‌ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని సీఎం విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికొక స్కూల్‌ పెట్టారన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువస్తే విమర్శలు చేశారని.. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే మెస్సీని తీసుకువచ్చామని తెలిపారు. మెస్సీ.. డ్రగ్స్‌ ముఠా లీడర్‌ కాదని, ఆర్థిక నేరగాడు కాదన్నారు. గత ప్రభుత్వం యూనిఫామ్‌లు ఇస్తే.. నెల రోజులకే చిరిగిపోయాయని విమర్శిస్తూ.. ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్‌ ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దసరా నాటికి అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్: భూపతిరాజు శ్రీనివాసవర్మ

టీపీఎస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 01:13 PM