ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయానికి శ్రీకారం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:49 AM
ఖమ్మంలోని అల్లీపురంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. త్రిదండి చినజీయర్‌స్వామితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా భూమిపూజ సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది.
చినజీయర్‌స్వామి, మంత్రి తుమ్మల, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా భూమిపూజ
త్వరితగతి ఆలయ నిర్మాణం : తుమ్మల
ఖమ్మం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మంలోని అల్లీపురంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుట్టింది. త్రిదండి చినజీయర్‌స్వామితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా భూమిపూజ సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ వేదపండితుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చినజీయర్‌స్వామి అన్నారు. ఆలయాలు కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ధర్మం, మానవత్వం పరస్పర సహకారం, సమాజ శ్రేయస్సు లాంటి విలువలను ప్రజల్లో పెంపొందించే కేంద్రాలుగా నిలవాలన్నారు.
ఈ ఆలయాన్ని త్వరితగతిన పూర్తిచేస్తామని తుమ్మల చెప్పారు. భక్తుల భాగస్వామ్యంతో ఆలయ నిర్మాణానికి 25 శాతం కంటే ఎక్కువ నిధులను టీటీడీకి అందిస్తామన్నారు. తుమ్మల పట్టువదలని విక్రమార్కుడని, ఆయన పట్దుదలతోనే ఖమ్మంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాండేందుకు దేశవ్యాప్తంగా 5 వేల ఆలయాలు నిర్మించాలని టీటీడీ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలోని కొడంగల్, కరీంనగర్‌లో కూడా ఆలయాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.
ఖమ్మంలో ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల విలువైన భూమిని అదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాగమయి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఈ ఆలయానికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి రూ.60 లక్షలు, వద్దిరాజు రూ.50 లక్షలు, మధుసూదన్ రూ.25 లక్షలు, ఓ భక్తుడు రూ.11 లక్షల విరాళం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జేఎన్‌టీయూ వీసీ క్వార్టర్లను బార్‌లా మార్చారు
ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్ పోరాటం
Read Latest AP News And Telangana News And International