పండుగ సరుకులు కొనడానికి వచ్చి.. మృత్యుఒడికి..
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:26 AM
దసరా పండుగకు సరుకులు కొనేందుకు ఆటోలో గ్రామం నుంచి ఖమ్మం నగరానికి వచ్చిన దంపతులు.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఖమ్మం జిల్లాలో ఆటోను ఢీకొట్టిన స్కార్పియో వాహనం
దంపతుల మృతి..
మరొకరికి తీవ్ర గాయాలు
రఘునాథపాలెం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు సరుకులు కొనేందుకు ఆటోలో గ్రామం నుంచి ఖమ్మం నగరానికి వచ్చిన దంపతులు.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆటోలో ఉన్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై మంచుకొండ వద్ద ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో నడుపుతూ జీవిస్తున్న కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన మద్దెబోయిన వెంకటేశ్ (35), తన భార్య రమ్య (30)తో కలిసి పండుగ సరుకులను కొనడానికి ఆదివారం గాదెపాడు నుంచి ఆటోలో ఖమ్మంకు వచ్చాడు.
సరుకులు కొనుగోలు చేసి.. రాత్రి వేళ తిరిగి ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో మంచుకొండ వద్ద ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వెంకటేశ్, రమ్యతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే దంపతులిద్దరూ మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కారణమైన స్కార్పియో డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. వెంకటేశ్, రమ్యలకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులిద్దరూ అనాథలుగా మారారు. మరోవైపు.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ కరుణాకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International