కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:07 AM
కీసర పోలీసుస్టేషన్ మాజీ సీఐ ఏ.ఆంజనేయులపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు.
ఏసీబీ తనిఖీల్లో రూ.2.28 కోట్ల ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కీసర పోలీసుస్టేషన్ మాజీ సీఐ ఏ.ఆంజనేయులపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఓ బియ్యం వ్యాపారి వద్ద రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి గత నెల 16న ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఆంజనేయులు అవినీతిపై అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆంజనేయులు ఇల్లు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లు సహా మొత్తం 5 చోట్ల శనివారం సోదాలు చేశారు.
ఆంజనేయులకు లింగోజీగూడలో రెండు 150 చదరపు గజాల ఇళ్ల స్ధలాలు, రూ.30లక్షలు విలువ చేసే చిన్నపాటి ఇల్లు, మన్సూరాబాద్లో 240గజాల్లో నిర్మించిన పాత ఇల్లు (విలువ రూ.40లక్షలు), పేరూరు గ్రామంలో 180గజాల్లో నిర్మాణంలో ఉన్న ఇల్లు (విలువ రూ.50లక్షలు), హలియాలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి(రూ.80లక్షలు) ఉన్నట్టు ఈ సోదాల్లో గుర్తించారు. హలియా ప్రాంతంలో బినామీల పేరిట మరికొన్ని వ్యవసాయ భూములున్నట్లు అనుమానిస్తున్నారు. అలాగే, ఆంజనేయులు ఇంట్లో రూ.7లక్షల నగదు, 60తులాల బంగారు ఆభరణాలు, ఒక మారుతి బ్రెజా కారు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆంజనేయుల ఆస్తుల విలువ రూ.2.28కోట్లుగా ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై.. ప్రజాచైతన్యానికి సినీ హీరోలు కదలాలి
రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న బీజేపీ
Read Latest AP News And Telangana News And International