Share News

భర్త లేని జీవితం ఎందుకని..!!

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:15 AM

భర్త అనారోగ్యంతో చనిపోయి మూడేళ్లయింది. అప్పట్నించి ఇద్దరు కొడుకులను, అత్తమామలను ఆమె పోషించుకుంటోంది.

భర్త లేని జీవితం ఎందుకని..!!

  • విషం కలిపిన బాదంపాలు తాగి, ఇద్దరు పిల్లలతో తాగించిన తల్లి

  • చికిత్స పొందుతూ తల్లి, చిన్నకుమారుడి మృతి

  • పెద్దకుమారుడి పరిస్థితి విషమం

  • ఖమ్మం జిల్లా లాలాపురంలో ఘటన

కొణిజర్ల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): భర్త అనారోగ్యంతో చనిపోయి మూడేళ్లయింది. అప్పట్నించి ఇద్దరు కొడుకులను, అత్తమామలను ఆమె పోషించుకుంటోంది. కానీ భర్త పోయిన బాధను మాత్రం మరిచిపోలేకపోతున్న ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ లోకాన్ని వీడాలనే ఆలోచనతో ఎలుకల నివారణ మందు కలిపిన బాదంపాలను తన పిల్లలతో తాగించి ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో జరిగిన ఈ ఘటనలో ఆ తల్లి, ఆరేళ్ల చిన్నకుమారుడు చికిత్స పొందుతూ మరణించగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి కొణిజర్ల ఎస్‌ఐ హరిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


లాలాపురానికి చెందిన షేక్‌ రంజాన్‌బీ (29), షేక్‌ అక్బర్‌ దంపతులకు నిస్సాన్‌ఉద్దిన్‌, నహీం (6) అనే కుమారులు ఉన్నారు. అనారోగ్యం వల్ల అక్బర్‌ మూడేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి అత్తమామల వద్దే ఉంటున్న రంజాన్‌ బీ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. అయితే, భర్త లేని జీవితం తనకెందుకని బాధపడుతున్న రంజాన్‌ బీ.. ఈనెల 19న బాదంపాలల్లో ఎలుకల నివారణ మందు కలిపి ఇద్దరు కుమారులకు ఇచ్చి తానూ తాగింది. దాని ప్రభావంతో ముగ్గురికి వాంతులవ్వగా అత్తమామలు ప్రశ్నించగా ఫుడ్‌పాయిజన్‌ అని చెప్పింది. దీంతో ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తొలుత ఫుడ్‌పాయిజన్‌గానే భావించారు.


కానీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యులు.. నిలదీయడంతో రంజాన్‌బీ అసలు విషయం బయటపెట్టింది. పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో వారిని హైదరాబాద్‌కు తరలించగా.. చిన్నకుమారుడు నహీం చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మరణించాడు. నిస్సాన్‌ఉద్దిన్‌ పరిస్థితి విషమంగానే ఉంది. రంజాన్‌బీ మంగళవారం సాయంత్రం ఖమ్మం ఆస్పత్రిలో మృతి చెందింది. నహీం లాలాపురం సమీపంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఒకటో తరగతి, నిస్సాన్‌ఉద్దిన్‌ రెండో తరగతి చదువుతున్నారు. రంజాన్‌బీ మామ సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:15 AM