Share News

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:43 PM

ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల నిర్వాసితులను కలిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటన‌పై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy Statement

ఖమ్మం, మార్చి 1: ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్న వెలుగుమట్ల సంఘట రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల నిర్వాసితులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. అనంతరం ప్రతిపక్ష రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటన‌పై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని, ప్రజలకు అసలు నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇళ్లు కూల్చి వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ అంశం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుమట్ల సంఘటన‌పై రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలపై రాష్ట్ర ప్రజలకు నిజం తెలియాల్సి ఉంది. వెలుగుమట్ల అంశం‌పై పూర్తి‌స్తాయి విచారణ జరిగింది, ఏ స్థాయి అధికారులైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. గత ప్రభుత్వ హయాంలో కూడా తమ ఇళ్లను కూల్చారని బాధితులు చెబుతున్నారు. వెలుగుమట్ల బాధితులు ఎవరూ స్వయంగా భూమి ఆక్రమణ చేసి ఇళ్లు వేసుకోలేదు. కొందరు వ్యక్తుల దగ్గర 30 వేల నుంచి అయిదు లక్షల వరకూ చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నారు. దళారీలు వెలుగుమట్లలో అందినంత దోచుకున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈనెల 15 లోపు ఇళ్ల స్థలంతో పాటు ఐదు లక్షలతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఇళ్లు నిర్మించి ఇస్తాం. నిరుపేదలను దోచుకున్న దళారీల‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి రూపాయి వసూలు చేసి తిరిగి ఇస్తాము, ప్రతిపక్ష పార్టీలు శవాలమీద చిల్లర ఏరుకునే రాజకీయాలు చేయవద్దు. కొన్ని పత్రికల‌లో ఇష్టానుసారం రాశారు. పేదల జీవితాలతో పదేళ్లు చెలగాటమాడి నేడు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని’ ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి

భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ

Updated Date - Mar 01 , 2026 | 09:55 PM