భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:41 PM
హార్ముజ్ జలసంధి మీదుగా వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ తాజాగా దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు ఒమాన్ తెలిపింది. నౌక సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌లు ముప్పెట దాడి చేస్తున్న సమయంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న స్కైలైట్ అనే చమురు రవాణా నౌకపై తాజాగా ఇరాన్ దాడి చేసింది. ఒమాన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌పై పలావు దేశ జెండా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నలుగురు గాయపడ్డారని ఒమాన్ తీర ప్రాంత రక్షణ కేంద్రం (ఓఎమ్‌సీ) ఒక ప్రకటనలో తెలిపింది (Oil Tanker Attacked in Strait of Hormuz).
స్కైలైట్ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నట్టు ఓఎమ్‌సీ. ఇందులో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్లు ఉన్నారని వెల్లడించింది. దాడి విషయం తెలిసిన వెంటనే సిబ్బందిని నౌక నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. నౌకపై క్షిపణితో దాడి చేశారా? అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురు చికిత్స పొందుతున్నారు. అంతకుముందు, దుఖ్మ్ పోర్టు వద్ద జరిగిన డ్రోన్ దాడిలో ఒక కార్మికుడు గాయపడ్డారు.
ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి మార్గం ఆయువుపట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం మీదుగానే సాగుతుంది. ఈ జలసంధి మీదుగా నౌకలను అనుమతించబోమని ఇరాన్ నేవీ నిన్న రేడియో సందేశాలు ప్రసారం చేసింది. దీంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో అనుసంధానించే హార్ముజ్ జల సంధికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమాన్, యూఏఈ దేశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ
ఖమేనీ మృతితో ముగ్గురి సభ్యుల కౌన్సిల్ చేతికి పాలనా పగ్గాలు