ఖమేనీ మృతితో ముగ్గురి సభ్యుల కౌన్సిల్ చేతికి పాలనా పగ్గాలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:21 PM
ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలనా పగ్గాలు చేరినట్టు తెలిపింది. దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయవ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడితో ఈ కౌన్సిల్ ఏర్పాటైనట్టు ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడిలో ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ప్రాణాలు కోల్పోవడంతో 40 రోజుల సంతాప దినాలు ప్రారంభమైనట్టు ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలనా పగ్గాలు చేరినట్టు తెలిపింది. దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయవ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడితో ఈ కౌన్సిల్ ఏర్పాటైనట్టు వెల్లడించింది. సుప్రీం లీడర్ ఎన్నికయ్యేంత వరకూ ఈ కౌన్సిల్ తాత్కాలికంగా దేశ పాలనా బాధ్యతలను చేపడుతుందని పేర్కొంది.
ఇస్లామిక్ విప్లవానికి దశాబ్దం క్రితం నాయకత్వం వహించిన అయతుల్లా రుహొల్లా ఖమేనీ మరణాంతరం అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ శనివారంనాడు జరిపిన కీలక దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అత్యున్నత దళమైన ఐఆర్‌జీసీ కమాండర్ మహమూద్ పాక్‌పౌర్, ఖమేనీ సలహాదారుడు అలీ పామ్‌ఖానీ మృతి చెందినట్టు ఐఆర్ఎన్ఏ ధ్రువీకరించింది.
మరోవైపు, ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్ రివల్యూషనరరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. టెల్ అవివ్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ స్థావరాలతో పాటు గల్ఫ్ దేశాల్లోని మిటలరీ క్యాంపులపై ప్రతీకార దాడులు జరిపింది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియా సహా మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. దీంతో యుఏఈ, ఖతార్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి.
ట్రంప్ హెచ్చరిక
పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుపడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారంనాడు తాజా హెచ్చరికలు చేశారు. ఇరాన్ దాడులు కొనసాగిస్తీ గతంలో ఎన్నడూ చూడనంత భీకరంగా గగనతల దాడులు జరుపుతామని హెచ్చరించారు. దీనికి ముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అమెరికా తీవ్రమైన నేరం చేసిందని, దీనికి ప్రతీకారం తప్పదన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ ప్రతీకార దాడులు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?