Share News

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' వీడియోలను విడుదల చేసిన అమెరికా

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:41 PM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో అమెరికా ఈ దాడులను చేస్తోంది. ఈ ఆపరేషన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా పర్యవేక్షించారు.

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' వీడియోలను విడుదల చేసిన అమెరికా
Operation Epic Fury

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో అమెరికా ఆ దాడులను చేస్తోంది. ఈ ఆపరేషన్ ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా పర్యవేక్షించారు. తాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయంతో సహా కీలకమైన ప్రభుత్వ, సైనిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబం సభ్యుల్లో కొందరు మరణించారు.


యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పంచుకున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమన్వయ చర్యలో భాగంగా క్షిపణుల ప్రయోగాలు, కచ్చితమైన దాడులు, కార్యాచరణ బ్రీఫింగ్‌లు కనిపిస్తున్నాయి. యూఎస్ కమాండ్ ప్రకారం.. ఆపరేషన్ ప్రారంభ దశలో కీలకమైన ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో కూడిన వైమానిక దాడులు జరిగాయి. ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వ పాలన నుంచి రాబోయే ముప్పులను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.


మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఆయన కోరినట్లుగానే తాము పని చేశామని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇరాన్‌ ముప్పు నుంచి అమెరికా ప్రజలను కాపాడటమే తమ లక్ష్యమని అధ్యక్షుడు చెప్పారని, ఈ క్రమంలో సాహసోపేతమైన ఆపరేషన్లు చేపట్టమని ఆదేశించారని వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్‌కామ్‌ దళాలు ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.


శనివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్, అమెరికా ఈ ఉమ్మడి దాడులను ప్రారంభింటాయి. ఇరాన్ బలగాలు షిఫ్ట్ మారుతున్న సమయంలో వారి వైమానిక స్థావరాలను పట్టుకోవడానికి అమెరికా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించింది. అలానే నింగి నుంచి ఇరాన్ ప్రజలు ఉన్న ప్రాంతాలను స్పష్టంగా నిర్ధారించడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలోని 200కి పైగా యుద్ధ విమానాలు, ఒక భారీ నావికా దళం ఇరాన్ వ్యాప్తంగా 500కి పైగా ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.


ఇవి కూడా చదవండి:

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. నిర్ధారించిన ఇరాన్ సైన్యం

అల్లాకు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది.. ఖమేనీ ఎక్స్ హ్యాండిల్‌లో ఖురాన్ పోస్ట్..

Updated Date - Mar 01 , 2026 | 02:55 PM