Share News

గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:03 PM

ఫిబ్రవరి 28న దాడులు మొదలవుతాయని ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కొన్ని రోజుల క్రితమే అంచనా వేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉదంతంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు.

గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ
AI Prediction on US, Iran Hostilities

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అదే రోజు దాడులు మొదలవుతాయని ఏఐ ముందే చెప్పిందంటూ కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై స్వయంగా ఎలాన్ మస్క్ కూడా స్పందించారు (Grok Prediction on US, Iran Hostilities).

ఇరాన్, అమెరికాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధం తప్పదని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో మాత్రం కొన్ని భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జెరూసలెం పోస్టు అనే వార్తా పత్రిక చిన్న ప్రయోగాన్ని (మెథొడోలాజికల్ ఎక్సర్‌సైజ్) నిర్వహించింది. అమెరికా దాడిని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందో చెప్పాలని పలు చాట్ బాట్స్‌ను కోరింది. ఓపెన్‌ ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినై, ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్‌ఏఐకి చెందిన గ్రోక్‌, ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్‌ ఏఐల నుంచి సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 25న వాటిపై ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.


సాధారణంగా యుద్ధం, రాజకీయాలు వంటి సున్నితమైన అంశాల్లో ఏఐ చాట్‌బాట్స్ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే స్పందిస్తాయి. ఇక ఊహాజనిత ప్రశ్నలపై స్పందించేందుకు నిరాకరిస్తుంటాయి. ఫలితంగా క్లాడ్ ఏఐ మొదట సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. ఇతర చాట్‌బాట్స్‌ కూడా కొంత సంశయించాయి. కానీ పలు రకాల ప్రశ్నలు సంధించాక తమ అంచనాలను వెల్లడించాయి.

మార్చ్ 7న లేదా 8వ తేదీన దాడులు మొదలయ్యే అవకాశం ఉందని క్లాడ్ అంచనా వేసింది. మార్చ్ 4 - మార్చ్ 6 మధ్యన దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జెమినై అంచనా వేసింది. కానీ గ్రోక్ మాత్రం ఫిబ్రవరి 28న దాడులు మొదలవ్వొచ్చని అంచనా వేసింది. యాదృచ్ఛికంగా అదే రోజున దాడులు ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎక్స్ వేదికగా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రకరకాల పోస్టులు పెట్టారు. ఈ విషయం తన దృష్టిలోకి రావడంతో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలగడమే మేధో శక్తికి అసలైన నిదర్శనమని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

ఖమేనీ మృతితో ముగ్గురి సభ్యుల కౌన్సిల్ చేతికి పాలనా పగ్గాలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

Updated Date - Mar 01 , 2026 | 05:15 PM