హరిణి హత్య కేసులో అదుపులో నిందితుడు!
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:50 AM
కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి మృతి ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కినట్టు సమాచారం.
నిందితుడు పవన్‌ను పట్టించిన హాట్‌స్పాట్
మరో వ్యక్తి హాట్‌స్పాట్‌తో ఇన్‌స్టా మెసేజ్‌లు చూసిన నిందితుడు
తిరుపతిలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
జూలూరుపాడు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి మృతి ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కినట్టు సమాచారం. సెప్టెంబరు 22న హరిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తమ కాలనీకే చెందిన దేవరకొండ పవన్ కుమార్, తన బిడ్డను హత్య చేశాడంటూ ఘటన జరిగిన రోజే పోలీసులకు యువతి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. హరిణిది హత్యేనని, ఆమెను గొంతు నులిమి చంపారని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక తేల్చింది. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఆధారాలు సేకరించారు. హరిణి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారించారు. చివరకు పవన్ కుమారే ఈ హత్యకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చిన పోలీసులు ప్రత్యేక బృందాలతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అతడి సెల్‌ఫోన్ ఐఎంఈ నంబరు ఆధారంగా నిఘా పెట్టారు. రెండు మూడు రోజులుగా మరో వ్యక్తి సెల్‌ఫోన్ హాట్‌స్పాట్‌ను వినియోగించి పవన్‌కుమార్ తన ఇన్‌స్టా గ్రామ్‌లోని మెసేజ్‌లను చూసినట్టు గుర్తించారు. ఆ మేరకు లొకేషన్‌ను ట్రేస్ చేసి.. పవన్ ఏపీలోని తిరుపతిలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. వెంటనే పోలీసు బృందం తిరుపతి వెళ్లి అక్కడ పవన్ హాట్‌స్పాట్‌ను వినియోగించిన లొకేషన్‌కు చేరుకుని ఆరా తీశారు. యువకుడు వినియోగించిన హాట్‌స్పాట్ ఫోన్ నంబర్ గురించి ఆరా తీసి.. ఓ సుతారి మేస్ట్రీని అదుపులోకి తీసుకున్నారు. పవన్, ఐదారురోజుల నుంచి తన వద్ద పనిచేస్తున్నాడని ఆ మేస్త్రీ చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పవన్ ఉంటున్న ప్రదేశానికి వెళ్లి మంగళవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూలూరుపాడు సర్కిల్ పరిధిలోని ఓ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చినట్టు తెలిసింది. అతడి నుంచి హత్యకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు గాను ఇద్దరు సీఐల సమక్షంలో విచారణ జరుపుతున్నారని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ముగ్గురు కొడుకులున్నా.. మెతుకు కరువై.. వృద్ధ జంట ఆత్మహత్య
వైరల్ ఇన్ఫెక్షన్లతో నాడీ క్షీణత వ్యాధులు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News