వైరల్ ఇన్ఫెక్షన్లతో నాడీ క్షీణత వ్యాధులు!
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:44 AM
ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్-19 వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు, పార్కిన్సన్ వంటి నాడీ క్షీణత వ్యాధులకు మధ్య సంబంధం ఉన్నట్లు ఇటీవలి కాలంలో పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఈ సంబంధానికి కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఆర్‌ఎన్‌ఏ వైరస్-ఆల్ఫా సిన్యూక్లిన్ బంధంపై సీసీఎంబీ పరిశోధన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్-19 వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు, పార్కిన్సన్ వంటి నాడీ క్షీణత వ్యాధులకు మధ్య సంబంధం ఉన్నట్లు ఇటీవలి కాలంలో పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఈ సంబంధానికి కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఎన్‌ఏ వైరస్ ఇన్‌ఫెక్షన్ల సమయంలో కణాల్లో చోటుచేసుకునే పరమాణు మార్పులు నాడీ క్షీణతకు ఎలా దోహదం చేస్తాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన డాక్టర్ స్వస్తి రాయ్ చౌధురి బృందం పరిశోధన చేసి పలు కీలక అంశాలను గుర్తించింది. ఈ క్రమంలోనే.. వైరస్ ప్రభావాన్ని తగ్గించే కణాల సహజ రక్షణ వ్యవస్థ గురించి కూడా తెలుసుకుంది. వారి పరిశోధన ఫలితం సెల్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
నాడీ క్షీణత వ్యాధుల్లో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటి.. మెదడులో అమైలాయిడ్ నిక్షేపాలు ఏర్పడటం. ప్రోటీన్లు ఒకచోట చేరి అసాధారణ గుత్తులుగా ఏర్పడటాన్నే అమైలాయిడ్ నిక్షేపాలు అంటారు. ఉదాహరణకు.. పార్కిన్సన్ వ్యాధిలో ఆల్ఫా- సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ ఇలా అమైలాయిడ్ గుత్తులను ఏర్పరుస్తుంది. ఆర్‌ఎన్‌ఏ వైరస్ ఈ ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తుందో స్వస్తి రాయ్ చౌధురి బృందం పరిశీలించింది. ఆర్‌ఎన్‌ఏ వైర్‌సలు తమ జన్యు పదార్థాన్ని ప్రత్యేకమైన ద్వితీయ నిర్మాణాలుగా మడతపెట్టుకుంటాయి. ఈ వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏలు కేవలం దారంలాంటి అణువులు కావు. అవి ఆర్‌ఎన్‌ఏ జీ-క్వాడ్రప్లెక్స్‌లుగా(ఆర్‌జీ4ఎస్) వ్యవహరించే ప్రత్యేకమైన త్రీడి నిర్మాణాలను కలిగి ఉంటాయి.
ఆ వైర్‌సలు కణాల్లోకి ప్రవేశించినప్పుడు, ఈ ప్రత్యేక నిర్మాణాలు ఆల్ఫా-సిన్యూక్లిన్‌తో బంధం ఏర్పరుచుకుంటాయి. పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన అమైలాయిడ్ గుత్తుల ఏర్పాటును వేగవంతం చేస్తాయి. అయితే ప్రతి వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్లా అమైలాయిడ్ గుత్తులు ఏర్పడటం, నాడీక్షీణత వ్యాధి రావడం తప్పనిసరి కాదు. కానీ, పదేపదే వైర్‌సలకు గురికావడం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని డాక్టర్ స్వస్తి రాయ్ చౌధురి పేర్కొన్నారు. ఈ పరిశోధన విజయవంతమైనందున.. వైరల్ ఇన్‌ఫెక్షన్ తర్వాత కణాల్లో జరిగే మార్పులు దీర్ఘకాలంలో పార్కిన్సన్ వంటి వ్యాధులకు ఎలా దోహదం చేస్తాయన్న అంశంపై స్పష్టత సాధించడమే లక్ష్యంగా తదుపరి పరిశోధన చేపట్టనున్నట్టు వెల్లడించారు.
వైరస్ నుంచి కాపాడే డీడీఎక్స్39ఏ
వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాల్లో.. వైర్‌సను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. సాధారణంగా కణకేంద్రకంలో ఉండే డీడీఎక్స్39ఏ అనే హెలికేజ్ ప్రొటీన్ ఇన్‌ఫెక్షన్ సమయంలో సైటోప్లాజంలోకి వస్తుంది. అక్కడ అది ఆల్ఫా-సిన్యూక్లిన్, వైరస్ ఆర్‌ఎన్‌ఏలోని ఆర్‌జీ4ఎస్ నిర్మాణాలతో బంధం ఏర్పరుచుకుంటుంది. డీడీఎక్స్39ఏ వైరస్ ఆర్‌ఎన్‌ఏలోని ఆర్‌జీ4ఎస్ నిర్మాణాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా వైరస్ తన ఆర్‌ఎన్‌ఏను ఉపయోగించి ప్రతిరూపాలను తయారు చేసుకోవడాన్ని అడ్డుకుంటుంది. వైరస్ ఆర్‌ఎన్‌ఏలోని ద్వితీయ నిర్మాణం విడిపోవడంతో ఆల్ఫా-సిన్యూక్లిన్ అమైలాయిడ్ ఏర్పడే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని అధ్యయన ప్రధాన రచయిత ఆంచల్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ముగ్గురు కొడుకులున్నా.. మెతుకు కరువై.. వృద్ధ జంట ఆత్మహత్య
నవంబరు దాకా జూరాలకు నారాయణపూర్ నీళ్లు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News