Share News

ముగ్గురు కొడుకులున్నా.. మెతుకు కరువై.. వృద్ధ జంట ఆత్మహత్య

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:39 AM

ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేశారా దంపతులు. వంశపారంపర్యంగా వచ్చింది కొంత.. కష్టపడి సంపాదించింది ఇంకొంత కలిపి మొత్తంగా తమకున్న 25 ఎకరాల భూమిని, సొంత ఇంటిని వారికి సమానంగా పంచి ఇచ్చారు. ఆ ఆస్తిని అనుభవిస్తున్న ఆ కొడుకులే అవసానదశకు చేరుకున్న కన్నవారిని గాలికొదిలేశారు.

ముగ్గురు కొడుకులున్నా.. మెతుకు కరువై.. వృద్ధ జంట ఆత్మహత్య
Sangareddy elderly couple

  • కుమారులకు 25 ఎకరాలు, ఇంటిని పంచి ఇచ్చిన దంపతులు

  • ఏళ్లక్రితమే పోషణ బాధ్యత గాలికొదిలేసిన కొడుకులు

  • వృద్ధురాలికి అనారోగ్యం..

  • వండే సత్తువ లేక బడిలో మధ్యాహ్న భోజనం తింటున్న వైనం

  • బతుకుదెరువు కోసం కొడుకుల నుంచి రెండెకరాలు ఇప్పించాలని అధికారులకు మొర

  • ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో బావిలో దూకి బలవన్మరణం

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన

నారాయణఖేడ్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేశారా దంపతులు. వంశపారంపర్యంగా వచ్చింది కొంత.. కష్టపడి సంపాదించింది ఇంకొంత కలిపి మొత్తంగా తమకున్న 25 ఎకరాల భూమిని, సొంత ఇంటిని వారికి సమానంగా పంచి ఇచ్చారు. ఆ ఆస్తిని అనుభవిస్తున్న ఆ కొడుకులే అవసానదశకు చేరుకున్న కన్నవారిని గాలికొదిలేశారు. శరీరం సహకరించిన రోజుల్లో వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో మోతుబరిగా బతికి, ఎవరైనా ఇంటికొస్తే తృప్తిగా భోజనం పెట్టిన స్థితి నుంచి.. చివరికి తమకు ఆకలేస్తే బుక్కెడు బువ్వ దొరకని దయనీయస్థితికి చేరుకున్న ఆ దంపతులు తీవ్ర మనస్తాపంతో చావే శరణ్యమనుకున్నారు. ఒకప్పుడు తమ కష్టంతో వ్యవసాయం చేసి, దండిగా దిగుబడులు సాధించిన పొలాల వద్దకే వెళ్లి అక్కడున్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం చాప్టా.కె లో ఈ ఘటన జరిగింది. మృతులు అదే గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి (88), అంజమ్మ (85). సీఐ శ్రీనివా్‌సరెడ్డి, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సారెడ్డి, అంజమ్మ దంపతులకు కుమారులు సిద్ధారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ఉన్నారు. కిష్టారెడ్డి హైదరాబాద్‌లో ఉంటుండగా, సిద్ధారెడ్డి, సంగారెడ్డి ఊర్లోనే ఉంటున్నారు. భూమిని పంచి ఇచ్చిన తర్వాత ముగ్గురు కుమారులు తల్లిదండ్రులను పోషించడం లేదు. వారి బాగోగులనూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధ దంపతులు కొన్నేళ్లుగా దాయాదుల ఇంట్లోనే ఉంటున్నారు. కొన్నాళ్లుగా అంజమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో వంట చేసుకునే పరిస్థితీ లేకుండా పోయింది.


దీంతో వృద్ధ దంపతులు ఆకలికి తట్టుకోలేక.. ఊర్లోని పాఠశాలలో పిల్లల కోసం వండిన మధ్యాహ్నభోజనం తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. తమను కుమారులు పోషించడం లేదని.. వారికి పంచి ఇచ్చిన భూమిలో రెండెకరాలను తమకు ఇప్పించాలంటూ వృద్ధదంపతులు రెండుమూడేళ్లుగా అధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. తమ గోడును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, చివరికి బుక్కెడు బువ్వ కూడా కరువవ్వడంతో వృద్ధ దంపతులు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. బుధవారం వ్యవసాయ బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న కుమారుడు సంగారెడ్డి బుధవారం ఉదయం పొలానికి వెళ్లగా బావిలో తల్లి మృతదేహం కనిపించడంతో విషయం బయటపడింది. మృతుల మనువడు మారుతిరెడ్డి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..

నవంబరు దాకా జూరాలకు నారాయణపూర్‌ నీళ్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 04:39 AM