Share News

నవంబరు దాకా జూరాలకు నారాయణపూర్‌ నీళ్లు!

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:33 AM

రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి నవంబరు వరకు జూరాల జలాశయానికి నీటి విడుదల కొనసాగనుంది.

నవంబరు దాకా జూరాలకు నారాయణపూర్‌ నీళ్లు!
jurala

  • తెలంగాణ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక

  • తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం

  • ప్రస్తుతం జూరాలకు స్వల్పంగా వరద

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి నవంబరు వరకు జూరాల జలాశయానికి నీటి విడుదల కొనసాగనుంది. తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి మేరకు ఈ సీజన్‌లో 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ నీటిని ఒకేసారి కాకుండా నవంబరు వరకు దశలవారీగా విడుదల చేయాలని తెలంగాణ కోరడంతో.. ఆ మేరకు నీటిని తరలించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాలకు 800 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 9.66 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం కలిగిన జూరాలలో ప్రస్తుతం 8.87 టీఎంసీల నీరు ఉంది. రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతాల్లోని జలాశయాలు నిండుగా ఉండటంతో నీటి కొరత ఉండే అవకాశం లేదు. ఇక కృష్ణా పరీవాహక ప్రాంతంలోని నారాయణపూర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.43 టీఎంసీల నిల్వ ఉంది.


ఎగువన ఉన్న ఆల్మట్టి రిజర్వాయర్‌ నుంచి 11,308 క్యూసెక్కులు విడుదలవుతుండగా, నారాయణపూర్‌కు 9,684 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి 400 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అలాగే తుంగభద్ర ప్రాజెక్టుకు 9,651 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదేస్థాయిలో ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 51,078 క్యూసెక్కులు తరలుతుండగా, నాగార్జునసాగర్‌కు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మరోవైపు, ఎగువ గోదావరి ప్రాజెక్టుల్లో వరద ఉధృతి మందగించింది. మహారాష్ట్రలోని జైక్వాడితో పాటు తెలంగాణలోని సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు ప్రస్తుతం చుక్కనీరు కూడా చేరడం లేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,157 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,023 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అయితే దిగువ గోదావరిలో మాత్రం వరద ప్రవాహం భారీగానే కొనసాగుతోంది. ప్రాణహితపై ఉన్న మేడిగడ్డకు 74 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం)కు 3.13 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం)కు 3.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. దాంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..

ఎల్‌నినో.. దిగుబడి ఏమవునో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 04:33 AM