రేగా కాంతారావుపై రేప్ కేసు
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:07 AM
బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు వేధిస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రాద్రి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది.
పెళ్లి ఆశ చూపి, సహజీవనం చేసి మోసం చేశారని
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి ఫిర్యాదు
యూట్యూబ్ చానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు
నాలుగేళ్లు సహజీవనం చేశాం.. 4 లక్షలు తీసుకున్నారు
ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు.. యువతి ఆరోపణ
కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టులో రేగా క్వాష్ పిటిషన్
హైదరాబాద్/కొత్తగూడెం/పంజాగుట్ట, జూలై 31(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు వేధిస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రాద్రి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ఓ హాస్టల్‌లో ఉంటూ యూట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తోంది. తనకు 18ఏళ్ల వయస్సున్నప్పుడు, 2022లో ఓ ఉద్యోగం కోసం ఆ యువతి రేగా కాంతారావును కలిసింది. తర్వాత, రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నానని చెప్పి యువతిని ప్రైవేటు ఫ్లాట్‌కు రమ్మని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు.
ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించారు. ఈ క్రమంలోనే తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి కాంతారావు యువతితో సహజీవనం ప్రారంభించారు. ఇందుకోసం అమీర్‌పేటలో ఓ నటుడికి సంబంధించిన ఫ్లాట్‌లో ఆమెను నివాసం ఉంచారు. కాంతారావు హైదరాబాద్ వచ్చినపుడల్లా యువతిని అక్కడే కలిసేవారు. అయితే, కొన్నాళ్లకు కాంతారావు తప్పుడు మాటలు చెపుతున్నారని గ్రహించిన యువతి ఆయన్ను దూరం పెట్టసాగింది. దీంతో, కాంతారావు, వాళ్లిద్దరు కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానని చెప్పి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి యువతి వద్ద రూ.4లక్షలు తీసుకుని, ఆ డబ్బు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత యువతి ఫోన్లకు స్పందించడం, కలవడం మానేశారు. మరోవైపు, 2024 నుంచే బాధిత యవతి ఫోన్ నుంచి ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని కాంతారావు ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రేగా ప్రవర్తనపై బాధిత యువతి షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు.
పెళ్లి చేసుకుంటాడనుకున్నా..
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె పరిస్థితి తెలిసిన ఓ సన్నిహితురాలు సహాయం చేస్తానని ముందుకు వచ్చి రేగా కాంతారావు సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే గుంటక ప్రవీణ్‌ను సంప్రదించి విషయం వివరించింది. రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రవీణ్ చెప్పాడు, కానీ తర్వాత వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలోనే రేగా కాంతారావుకు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ నూకరపు రమేశ్ బాధిత యువతికి మార్చి 16న రూ.5లక్షలు, మార్చి 18న రూ.3.5 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత కాంతారావు ఈ లావాదేవీల వివరాలను షీ టీమ్‌కు సమర్పించి.. సదరు యువతి డబ్బుల కోసం వేధిస్తోందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. దీంతో, బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి, మోసం చేసిన రేగా కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే తాను కాంతారావును అంగీకరించానని, ఈ నాలుగేళ్లలో ఆయన తనను లైంగికంగా చాలా హింసించాడని ఆమె పేర్కొన్నారు. బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని రేగా కాంతారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేగా కాంతారావుపై అత్యాచారం ఆరోపణలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.
రేగాపై గతంలో భూకబ్జా ఆరోపణలు కూడా
రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ నుంచి పినపాక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో రెండోసారి అదే పార్టీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత కాలంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. పార్టీ మారిన తర్వాత మణుగూరులోని కాంగ్రెస్ భవనాన్ని బీఆర్‌ఎస్ భవనంగా మార్చి వివాదానికి తెరలేపారు. ఆ సమయంలో నియోజకవర్గంలో పెద్దఎత్తున నిరసనలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులైన భట్టి విక్రమార్క, బలరామ్‌నాయక్, సీతక్క, పొదెం వీరయ్య లాంటి నేతలు మణుగూరులో రేగా చేష్టలపై మండిపడుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేపట్టారు. రేగా భూకబ్జాలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. కరకగూడెం భట్టుపల్లి, మణుగూరు ప్రాంతాల్లో సుమారు 70ఎకరాల ఫారెస్టు భూములను రేగా కబ్జా చేసి, వాటికి బినామీ పట్టాలు ఇప్పించారనే ఆరోపణలున్నాయి.