తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. ఓ ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:31 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని ఓ కంపెనీ గ్యాస్ గోడౌన్ మేనేజరుగా పని చేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భద్రాచలంలోని లాడ్జిలో ఉరివేసుకొని బలవన్మరణం
అతడిపై ఇటీవల ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదు
గ్యాస్ ఏజెన్సీలో ఆమె అక్రమాలను అడ్డుకున్నందుకే నాపై కక్ష
ఆమెతోపాటు మూడు టీవీచానళ్ల విలేకరులు వేధిస్తున్నారు
అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్
భద్రాచలం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని ఓ కంపెనీ గ్యాస్ గోడౌన్ మేనేజరుగా పని చేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సహోద్యోగితోపాటు మూడు టీవీ చానళ్ల విలేకరుల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో ఆయన ఆరోపించాడు. లక్ష్మీనారాయణపై ఇటీవల ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయటంతో.. ఆయనపై అంతర్గత కమిటీ విచారణ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో ఆయన శనివారం భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు లక్ష్మీనారాయణ తన కార్యాలయ వాట్సాప్ గ్రూప్లో మరణ వాంగ్మూలం లేఖను పెట్టడంతో గమనించిన ఇతర ఉద్యోగులు.. భద్రాచలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే లాడ్జీకి చేరుకుని లక్ష్మీనారాయణను భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలుండగా ఒక కుమార్తెకు వివాహమైంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరణ వాంగ్మూలంలో కీలక విషయాలు
లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే ముందు మరణ వాంగూల్మం పేరుతో వాట్సా్పగ్రూపులో పెట్టిన లేఖలో కీలక విషయాలు తెలిపారు. పాల్వంచ గ్యాస్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2025లోనే జిల్లా మేనేజరుకు లేఖ రాసినట్టు తెలిపారు. సీసీ కెమెరాలు లేకపోవటంతో ఓ మహిళా ఉద్యోగి అవినీతికి తెరలేపారని, తాను అడ్డుకున్నందుకు తనపై కక్షగట్టారని ఆరోపించారు. ‘మీరు వినియోగదారుల వద్ద ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకోరు? మీరు తీసుకోరు.. మమ్మల్ని కూడా తీసుకోనివ్వరు. ఇలా అయితే ఎలా సార్’ అని ఆ మహిళా ఉద్యోగి తనను ప్రశ్నించేదని లేఖలో ప్రస్తావించారు. ఆ ఉద్యోగినితోపాటు ఆమె భర్త.. మూడు ప్రముఖ టీవీ చానళ్లకు చెందిన ముగ్గురు విలేకరులు, మరికొందరు కలిసి తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. తనను బూతులు తిట్టి బెదిరించారని ఆరోపించాడు. సదరు మహిళా ఉద్యోగి తనపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ చేశారని తెలిపారు. తన చావుకు ఆ మహిళా ఉద్యోగి, ఆమె భర్త, ముగ్గురు విలేకరులతో పాటు మరికొందరు కారణమని ఆ లేఖలో చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Read Latest AP News And Telangana News And International