Share News

MLC Kavitha: చివరి ప్రసంగమంటూ బీఆర్ఎస్‌పై బాంబ్ పేల్చిన కవిత..

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:23 PM

శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు.

MLC Kavitha: చివరి ప్రసంగమంటూ బీఆర్ఎస్‌పై బాంబ్ పేల్చిన కవిత..
MLC Kavitha

హైదరాబాద్, జనవరి 5: శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు తెలంగాణ శాసనమండలి సమావేశాలకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. ఇదే తన చివరి ప్రసంగం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్‌పై, తాను ఎదుర్కొన్న పరిస్థితులపై, బీఆర్ఎస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు.


బీఆర్ఎస్ పార్టీపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు కవిత. తన కింద నాయకులు చేస్తోన్న దురాగతాలను కేసీఆర్ గమనించడం లేదన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చటాన్ని తాను అంగీకరించలేదన్నారు కవిత. తెలంగాణలో ఏం సాధించిందని.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వెళ్లిందంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కవిత. బీజేపీ తనను జైలుకు పంపితే.. బీఆర్ఎస్ నాయకులు తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా మూడేళ్లు ఈడీతో తాను పోరాటం చేశానన్నారు.


పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదంటూ కవిత సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని అన్నారు. హరీష్ రావు అవినీతి పరుడంటూ కవిత ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదని.. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అంటూ శాసనమండలి సాక్షిగా దుమ్మెత్తిపోశారు. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా తనను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ‘నా ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తోన్న.. బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ’ అని కవిత స్పష్టం చేశారు.


కవిత ఇంకా ఏమన్నారంటే..

‘ప్రశ్నిస్తే.. బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నాపై కక్ష కట్టారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి పోలేదు. పార్టీలో.. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించాను. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. ఉద్యమకారులకు ఆర్థికసాయం చేద్దామంటే నా మాట వినలేదు. ఇసుక దందాల కోసమే నేరెళ్ళ దురాగతం జరిగింది. తెలంగాణ వచ్చాక కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవటం అవమానకరం. సొంత సంస్థ జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి గుర్తింపు సంపాదించుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యమకారులు మాటలు కేసీఆర్‌కు చేరనివ్వటం లేదు. నిజామాబాద్ ఎంపీ‌ టికెట్ కోసం బీఆర్ఎస్‌ను అడుక్కోలేదు. ఉద్యమంలో పార్టీలకు అతీతంగా కష్టపడ్డాను. తెలంగాణ జాగృతి సంస్థతో రాజకీయాల్లోకి వచ్చాను. బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళాను. సెప్టెంబర్ 3న ఛైర్మన్ ఫార్మాట్‌లో రాజీనామా చేశాను. నీళ్ళ విషంలో గత పాలకులు చేస్తోన్న తప్పునే.. ప్రస్తుత పాలకులు చేస్తున్నారు.’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు కవిత.


Also Read:

మరోసారి తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్ పేరు.. టెస్టుల్లో మార్పు కోరుతున్న గిల్!

శాసనమండలిలో ఇదే నా చివరి ప్రసంగం: కవిత

అమెరికా కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతుల మృతి..

Updated Date - Jan 05 , 2026 | 01:30 PM