Share News

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:18 AM

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది.

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు

హైదరాబాద్, మార్చి 24: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. మంగళవారం జగిత్యాలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు విప్ అది శ్రీనివాస్ పయనమయ్యారు. పార్టీని వీడవద్దంటూ ఆయనకు నచ్చజెప్పేందుకు తమ వంతు ప్రయత్నం చేయనున్నారు. అదీకాక మార్చి 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే టి. జీవన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే.


జీవన్ రెడ్డి రాజీనామా గడువు సమీపిస్తుండడంతో.. పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. పార్టీని వీడకుండా ఉండేందుకు ఆయనకు నచ్చ చెప్పాలంటూ న్యూఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర నాయకులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలు.. జగిత్యాలకు ప్రయాణం కట్టారు.


అసలు ఏం జరిగింది..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో టి. జీవన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆయనకు ఆ పార్టీతో అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఆయన మంత్రిగా పని చేశారు. పలుమార్లు జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొంది.. అనేక కీలక పదవులు పొందారు. రాష్ట్ర విజభన జరిగిన తర్వాత సైతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న అతి కొద్ది మంది సీనియర్లతో జీవన్ రెడ్డి ఒకరు. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.


ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ రాకను.. స్థానికంగా బలమైన నేతగా ఉన్న టి.జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు.. ఆయన వల్ల పార్టీలోని కేడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందంటూ సంజయ్‌పై విమర్శలు సైతం చేశారు.


దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి టి. జీవన్ రెడ్డిని బుజ్జగించారు. దాంతో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఆ తర్వాత సైతం పలుమార్లు సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య పోరు మాత్రం కొనసాగింది. అలాగే సంజయ్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

ఆ సమయంలో సైతం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని సంజయ్ వర్గానికి కేటాయించగా.. వైస్ చైర్మన్ పదవిని మాత్రం జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ పెద్దలు కేటాయించారు. పార్టీలో తాను సీనియర్ అయినా.. తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వీడుతున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోకి ఆయనకు ఆహ్వానం అందినట్లు ప్రచారం సైతం సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 09:38 AM