Raajanna siricilla : ఇది ‘రైతు వారం’..
ABN , Publish Date - May 04 , 2026 | 01:30 AM
ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలు తీసుకొస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో
- నేటి నుంచి రైతు సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అవగాహన
- జిల్లాలోని 57 రైతు వేదికల్లో ఏర్పాట్లు
- ఏడు శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ
- భూసార పరీక్షలకు మట్టి సేకరణ
- ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
- రెండు విడతల్లో రైతు భరోసా డబ్బులు జమ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలు తీసుకొస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులపాటు వివిధ అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈవారం ‘రైతు వారం’గా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా వారం రోజులపాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులు, రైతులకు ఉపయోగపడే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సోమవారం మొదలయ్యే రైతు వారం 9వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 రైతు వేదికల ద్వారా నిర్వహించే రైతువారం కార్యక్రమాన్ని ఏడు శాఖల సమన్వయంతో జరిగే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేశారు. ప్రధాన వ్యవసాయ శాఖతో పాటు అనుబంధంగా ఉండే ఉద్యానవన, బ్యాంకులు, నీటిపారుదల, మత్స్య, విద్యుత్, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో నిర్వహించే రైతు వారం కార్యక్రమంలో అధికారులు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు అందుకు సంబంధించిన పథకాలకు రైతుల నుంచి దరఖాస్తులు చేసుకునే విధంగా చూస్తారు. జిల్లాలో ఇప్పటికే యాంత్రీకరణ పథకానికి వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది.
జిల్లాలో కార్యక్రమాలు ఇలా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాబోయే వానకాలం సీజన్లో 2.43 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. ఇప్పటికే యాసంగి సీజన్ వరి కోతలు, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయాలు జరుగుతున్నాయి. వానకాలం సీజన్‌కు రైతులు సంసిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని రైతు వేడుకల ద్వారా నిర్వహించే రైతు వారం కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్షల కోసం మట్టి సేకరణ, హెల్త్‌కార్డుల పంపిణీ, ఎరువుల అవసరాలు, యాజమాన్య పద్ధతులు, నానో యూరియాపై అవగాహన కల్పిస్తారు. సన్న రకాల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఉద్యానవన పంటల సాగు, ఆయిల్‌పామ్ విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఉద్యానవన శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ అందిస్తుంది. పశు సంవర్ధక, విద్యుత్, నీటిపారుదల శాఖ అందుకు కావలసిన అవగాహన కల్పిస్తారు. రైతు సమావేశాల వద్ద ఆయిల్‌పామ్ ఉత్పత్తులు, ఆయిల్ సీడ్స్, మిల్లెట్, రంగంలో డ్రోన్ల పనితీరు వాటి ఉపయోగాలు, సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన యంత్రాలు వంటివి ప్రదర్శిస్తారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో కంప చెట్లు, గుర్రపుడెక్క తొలగించడంతోపాటు సమతుల్యంగా నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి పరిశ్రమ, పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణపై అవగాహన కల్పిస్తే, దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాల ద్వారా సేవలు వంటి అంశాలపై అవగాహన కలిగిస్తారు.
భూసార పరీక్షలకు వలంటీర్లు
భూసార పరీక్షలు ద్వారా రైతులకు ఎలాంటి పంటలు తమ భూమిలో వేస్తే లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుంది. అందుకోసం ప్రభుత్వం మండలాల వారీగా వలంటీర్లను ఎంపిక చేసింది. జిల్లాలోని 175 రెవెన్యూ గ్రామాల్లో 525 మంది వలంటీర్లను ఎంపిక చేసి వారికి అవసరమయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. రైతు వారం కార్యక్రమంలో భూసార పరీక్షలు కూడా చేయనున్నారు.
జిల్లాలో రెండు విడతల్లో రైతు భరోసా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మూడు విడతల్లో పూర్తిస్థాయి నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో 175 రెవెన్యూ గ్రామాల్లో యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్న క్రమంలో గతనెల మార్చిలో మొదటి విడతలో 1,41,415 మంది రైతులకు రూ 68 కోట్ల 23 లక్షల 1211 రైతు భరోసా సాయం నిధులు జమ చేశారు. ఏప్రిల్‌లో రెండు విడతలో 1,41,415 రైతుల ఖాతాల్లో రూ 154 కోట్ల 34 లక్షల 40 వేల 221 నిధులు జమ చేశారు.
రైతు వారం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయ అధికారి
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే రైతు వారం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు వివిధ అంశాలపై గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని 57 రైతు వేదికల్లో జరిగే కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల, పంటల సాగుపై అవగాహన పొందడానికి రైతు వారం ఉపయోగకరంగా ఉంటుంది.