Share News

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:33 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కార్యకర్తలు ఈ సర్కారును కూకటివేళ్లతో పెకిలిస్తారని చెప్పారు.

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ షురూ

  • రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

  • ఈసారి బీజేపీని ఎన్నుకుంటారనే విశ్వాసముంది

  • రాహుల్‌గాంధీకి ఏటీఎంగా మారిన రేవంత్‌రెడ్డి

  • 35 నెలల పాలనలో 82 సార్లు ఢిల్లీ దర్బార్‌కు వెళ్లారు

  • అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం కోసం మోకరిల్లారు

  • అరాచకాన్ని నమ్ముకున్న కాంగ్రెస్‌, ఇండి కూటమి

  • మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం.. ప్రజలు మావైపే

  • 2029లో మోదీ మళ్లీ ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు

  • మహా పాదయాత్రలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

  • ప్రజాస్వామ్యం వైపు ప్రజలు: రాంచందర్‌రావు

  • కరీంనగర్‌ గడ్డ కాషాయ అడ్డా: బండి సంజయ్‌

  • కరీంనగర్‌ మహా పాదయాత్రకు భారీగా జనం

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి నబీన్‌ అభినందనలు

కరీంనగర్‌/హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కార్యకర్తలు ఈ సర్కారును కూకటివేళ్లతో పెకిలిస్తారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎన్నుకుంటారన్న సంపూర్ణ విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. హామీలను తుంగలో తొక్కినందుకు రేవంత్‌రెడ్డికి ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. సోమవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్రలో నితిన్‌ నబీన్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో ఉన్న ఓ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించిన ప్రజలు అంతకన్నా ఎక్కువ అవినీతి ప్రభుత్వం వస్తుందని ఊహించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలకు ఏటీఎంగా మారారని, 35 నెలల పాలనలో 82 సార్లు ఢిల్లీ దర్బార్‌కు వెళ్లి అధిష్ఠానానికి మోకరిల్లారని విమర్శించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం కన్నా ఎక్కువగా ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, ఇండి కూటమి నేతలు అరాచకత్వాన్ని నమ్ముకున్నారని, తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని తెలిపారు. రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటున్నారని, కానీ.. దేశ ప్రజల ఓట్లు బీజేపీ పక్షాన ఉన్నాయని చెప్పారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో కనుచూపు మేర జనమే కనిపిస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో విపక్షాలు సర్వశక్తులూ ఒడ్డినా.. ఒక్క రామ్‌లీలా మైదానాన్ని కూడా నింపలేకపోయారన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి మించి పదిరెట్ల జనాన్ని సమీకరించి సత్తా చాటారని చెప్పారు.


TG copy.jpgమా హృదయంలో రాజ్యాంగం..

సర్‌ విషయంలో ఇండి కూటమి నేతలు నానా యాగీ చేస్తున్నారని నితిన నబీన్‌ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, తమకు మాత్రం ఆ రాజ్యాంగం హృదయంలో ఉందని అన్నారు. చొరబాటుదారులకు ఓటుహక్కు ఉండాలని కాంగ్రెస్‌, ఇండి కూటమి అంటోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి కూడా మన దేశాన్ని అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్‌ విమర్శలు చేస్తున్నా.. మన ఆర్థిక శక్తిని ప్రపంచం గుర్తిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అత్యంత బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్‌.. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని తెలిపారు. మోదీ పాలనతో దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో వికసిత్‌ భారత్‌ దిశగా మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ర్టాల నుంచి ఢిల్లీకి రూపాయి పంపితే 15 పైసలు పేదలకు అందేవని, ఇప్పుడు రూపాయికి రూపాయి పేదలకు అందుతోందని చెప్పారు. 2029లో మోదీ మళ్లీ ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఏ సంకల్పం తీసుకున్నా విజయవంతం చేస్తారని, నషా ముక్త్‌ భారత్‌ కోసం కలిసికట్టుగా శ్రమించాలని కోరారు. బండి సంజయ్‌ పనితీరును తాను గతంలోనూ చూశానన్నారు. కరీంనగర్‌ స్ఫూర్తిని తెలంగాణలో ప్రతి కార్యకర్త కొనసాగించాలని పిలుపునిచ్చారు.


రాహుల్‌ ప్రధాని అవుతారనడం అతిపెద్ద జోక్‌

కాంగ్రెస్‌ పార్టీ కులాలు, ప్రాంతాల పేరిట దేశంలో అరాచకాలను సృష్టిస్తూ రెచ్చగొడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదని వారంటున్నారని, అలా అయితే రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని, ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని అన్నారు. రాహుల్‌గాంధీ దేశ ప్రధాని అవుతారని రేవంత్‌రెడ్డి అనడం దేశంలోనే అతిపెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల త్యాగం, పోరాటాలు ఎనలేనివన్నారు. మహా పాదయాత్రకు అధిక సంఖ్యలో హాజరైన కాషాయ సైన్యాన్ని చూస్తే తనకు తొడకొట్టాలని అనిపిస్తోందన్నారు. కరీంనగర్‌ గడ్డ కాషాయ అడ్డా అని ప్రకటించారు. ఢిల్లీలో మోదీ అనే నిప్పు ఉందని, నిప్పుతో చెలగాటమాడితే కాంగ్రెస్‌ మాడి మసైపోతుందని హెచ్చరించారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అందరికీ అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చాన్స్‌ ఇస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాగా, ‘‘కాంగ్రెస్‌ నాయకులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలంటున్నారు. మరి కరీంనగర్‌ వీధులను చూశారా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పాదయాత్రకు లక్ష మందిపైగా తరలివచ్చారని, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఇంత భారీ జనాన్ని రప్పించగలరా? అని సవాల్‌ చేశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా 5వేల మందిని సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. దీనినిబట్టి ప్రజలు ప్రజాస్వామ్యం వైపు నిలబడుతున్నారని రుజువవుతోందన్నారు.


TG copy.jpgకాషాయమయమైన కరీంనగర్‌..

కరీంనగరం.. కాషాయమయమైంది. జై శ్రీరామ్‌ నినాదాలతో మార్మోగింది. ఎటు చూసినా జనసందోహమే. బీజేపీ తెలంగాణ శాఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సోమవారం నిర్వహించిన మహా పాదయాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు.. ఆట పాటల నడుమ గాంధీ చౌక్‌ నుంచి వైశ్యభవన్‌, రాజీవ్‌చౌక్‌, టవర్‌ సర్కిల్‌, శాస్త్రి రోడ్‌ మీదుగా కమాన్‌ సెంటర్‌ వరకు జనసందోహం మధ్య రెండు కిలోమీటర్ల మేర దూరానికి దాదాపు 1.45 గంటలపాటు పాదయాత్ర సాగింది. కమాన్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఎగురవేసి పాదయాత్రను ముగించారు. యాత్రలో కార్యకర్తల ఉత్సాహం, ప్రజా స్పందనను చూసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఖుషీ అయ్యారు.


పాదయాత్ర అనంతరం తిరిగి వెళ్లే సమయంలో బండి సంజయ్‌ చేయి పట్టుకుని ‘మహా పాదయాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ చేశావ్‌. నిర్వహణకు 3 రోజులే సమయం ఉన్నా.. అంత తక్కువ సమయంలో సభను బాగా నిర్వహించావ్‌. ఇది మర్చిపోలేని అనుభూతి కలిగించింది. ఇక్కడ ప్రజాస్పందన చాలా బాగుంది. ఎక్కడా చూడని విధంగా కరీంనగర్‌ కార్యకర్తల్లో విపరీతమైన జోష్‌ కనిపించింది. ఆనందంతో వెళ్తున్నా’ అంటూ సంజయ్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. కాగా, మహా పాదయాత్ర నిర్వహణకు తక్కువ సమయమే ఉన్నా భారీగా జన సమీకరణ చేయడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక్క కరీంనగర్‌ నుంచే లక్ష మందికి పైగా జనం వచ్చారని, ఇంత పెద్ద ఎత్తున జనం రావడం కరీంనగర్‌ చరిత్రలోనే రికార్డు అని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని పాదయాత్రల కంటే కరీంనగర్‌లో బండి సంజయ్‌ నేతృత్వంలో నిర్వహించిన పాదయాత్ర టాప్‌లో నిలిచిందని బీజేపీ నాయకులు, పరిశీలకులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 03:46 AM