అమెరికాకు ముల్కనూర్ బియ్యం
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:46 AM
ముల్కనూరు బ్రాండ్‌కు చెందిన జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకం బియ్యానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది.
ఎగుమతులకు అనుమతి ఇచ్చిన కేంద్రం
ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యం
భీమదేవరపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ముల్కనూరు బ్రాండ్‌కు చెందిన జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకం బియ్యానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. అమెరికాలోని తెలుగు వారి నుంచి ఈ బ్రాండ్ బియ్యం కోసం డిమాండ్లు వస్తుండడంతో ముల్కనూర్ సహకార సొసైటీ ఎగుమతి చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా 25 ఏళ్ల క్రితం ముల్కనూర్ సొసైటీ తమ ప్రాంత రైతుల నుంచి పరిమితంగా ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్ చేసేది.. ఈ బియ్యం నాణ్యంగా, రుచికరంగా ఉండడంతో సొసైటీ పరిధిలోని రైతులు, వారి బంధువులు ఈ బియ్యం కావాలంటూ సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో.. 15 సంవత్సరాల నుంచి ముల్కనూర్ సొసైటీ తమ బియ్యాన్ని బ్రాండింగ్ చేసి అమ్మకాలు ప్రారంభించింది. క్రమేపీ సొసైటీకి చెందిన బీపీటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల ద్వారా ప్రతి ఏటా రూ.25 కోట్ల విలువైన ‘‘ముల్కనూర్ బియ్యాన్ని’’ విక్రయిస్తోంది.
తెలుగువారితో అమెరికాలో డిమాండ్..
ముల్కనూర్ బ్రాండ్ బియ్యం రుచి చూసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వారు అమెరికాలో ఉన్న తమ బంధువులకు సమాచారం అందించారు. దీంతో అమెరికాలో ఉన్న పలువురు తెలుగు వారు ఈ బ్రాండ్‌పై మక్కువ చూపించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలంటూ గత సంవత్సర కాలంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో... సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో... అమెరికాలోని హార్వెస్ట్ లింక్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని ముల్కనూర్ బియ్యాన్ని విశాఖ పోర్టు ద్వారా అమెరికాకు పంపించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
లాభదాయక ధర
నాణ్యతపరంగా మెరుగైన క్రిమిసంహారక మందులు వాడని తెలంగాణ సోనా రకం, జై శ్రీరామ్ రకాలను ఎగుమతి చేయనున్నారు. స్థానికంగా జైశ్రీరామ్ రకం కిలో రూ.80, తెలంగాణ సోనా కిలో రూ.70 చొప్పున విక్రయిస్తుండగా... అమెరికాలో.. మన కరెన్సీ ప్రకారం కిలోకు రూ.200 వరకు ధర పలికే అవకాశం ఉంది. దీంతో ముల్కనూర్ సొసైటీబియ్యం ఎగుమతికి మొగ్గు చూపింది.
మొదటి విడతగా 25 టన్నులు
మొదటి విడతలో 25 టన్నుల బియ్యాన్ని అమెరికాకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నౌకల ద్వారా ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. కంటైనర్‌కు అనుమతి రాగానే 2 నెలల్లో ముల్కనూర్ బ్యాంక్ బియ్యం ఎగుమతి అవుతాయి. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి,
ముల్కనూర్ సహకార సొసైటీ అధ్యక్షుడు
ఇవి కూడా చదవండి...
ఎలివేటెడ్ కారిడార్‌తో రూ.1,200 కోట్లు ఆదా
ఏసీబీ వలలో ఇద్దరు మహిళా అధికారులు
సచివాలయంలో తాగు నీటికి తిప్పలు!
Read Latest Telangana News And Telugu News