సచివాలయంలో తాగు నీటికి తిప్పలు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:31 AM
రాష్ట్ర సచివాలయానికి మంచి నీటి క్యాన్ల సరఫరా నిలిచిపోయింది. పలు శాఖలకు, మంత్రులు, అధికారుల పేషీలకు మంచి నీళ్లు అందక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
క్యాన్ల సరఫరా నిలిపేసిన ఏజెన్సీలు
బిల్లులు చెల్లించకపోవడమే కారణం
రూ.50 లక్షల వరకు పెండింగ్ బకాయిలు
అన్ని అంతస్తుల్లో వాటర్ ప్యూరిఫైయర్
కూలింగ్ యూనిట్లున్నా పట్టించుకోకపోవడంతో నిరుపయోగం
ఎవరి నీళ్లను వారే తెచ్చుకోవాలని కొన్ని సెక్షన్లలో ఉద్యోగులకు సూచనలు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయానికి మంచి నీటి క్యాన్ల సరఫరా నిలిచిపోయింది. పలు శాఖలకు, మంత్రులు, అధికారుల పేషీలకు మంచి నీళ్లు అందక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ బిల్లులు చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణం.. దాదాపు రూ.50 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయని, ఆర్థికశాఖ నుంచి బిల్లులు క్లియర్ కావడం లేదని సంబంధిత ప్రైవేటు ఏజెన్సీలు వాపోతున్నాయి. టోకెన్లు వచ్చినా పెండింగ్లో పెట్టారని.. బకాయిలు చెల్లించకుం డా మంచినీళ్లను ఎలా సరఫరా చేయాలని సరఫరాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత శాఖల అధికారులు, మంత్రుల పేషీల్లోనూ చెప్పారని.. ఆ తర్వాతే సరఫరా నిలిపేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సచివాలయంలో సీఎం, మంత్రుల చాంబర్ల నుంచి సీఎస్, ఐఏఎస్ల పేషీలు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సెక్షన్ కార్యాలయాలకు నాలుగు ప్రైవేటు ఏజెన్సీలు మంచి నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటిలో 25 లీటర్ల క్యాన్లు, పేషీలకు 150 మిల్లీలీటర్ల పలు కంపెనీలకు చెందిన వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు. అయితే కొంతకాలం గా 25 లీటర్ల క్యాన్లతో పాటు చిన్న బాటిళ్లకు చెందిన పేమెంట్లు కూడా అందడం లేదని సమాచారం. 150 మిల్లీలీటర్ల బాటిళ్లను నిలిపేయడంతో ఇటీవల ఓ శాఖకు చెందిన ఐఏఎస్ తన కార్యాలయానికి బయటి నుంచి రెండు కాటన్ల బాటిళ్లను తెప్పించినట్లు తెలిసింది. మరోవైపు.. సచివాలయంలోని అన్ని అంతస్తుల్లో వాటర్ ప్యూరిఫైయర్ కూలింగ్ (నీటిని శుద్ధి చేసి చల్లబరిచే) యూనిట్లను ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవడంతో అవేవీ పనిచేయడం లేదు. ఆ కారణంగానే అన్ని సెక్షన్లకు క్యాన్లను వేయిస్తున్నారు. వెరసి మంచి నీళ్ల కోసమే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది.
చివరికి ఆ క్యాన్ల సరఫరా కూడా నిలిచిపోవడంతో ఎవరి మంచి నీళ్లను వారే తెచ్చుకోవాలని కొన్ని సెక్షన్లలో ఉద్యోగులకు సూచించినట్టు సమాచారం. మరోవైపు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగానే సచివాలయంలో కొన్ని పేషీలకు, సీఎం సీపీఆర్వో, పీఆర్వోల చాంబర్లకు పంపించే భోజనాన్ని సంబంధిత కాంట్రాక్టర్లు ఇటీవల నిలిపేశారు. 2-3 నెలల బిల్లులు చెల్లించకపోవడంతో.. ఇప్పటికీ ఆయా చాంబర్లకు భోజనాలు వెళ్లడం లేదు. ఇక ఏదైనా పేషీలకు టీ, కాఫీలు కావాలంటే ఒక కాగితంపై (ఇండెంట్) రాసి పంపితేనే ఇస్తున్నారని సమాచారం. ఇటు ఐదో అంతస్తులో సీఎం పీఆర్వోలు ఉండే చాంబర్లో ప్రింటర్ జీరాక్స్ మెషిన్లో కాగితాలు ప్రింట్ తీసేందుకు అవసరమైన కాట్రిడ్జ్ అయిపోయి దాదాపు నెల రోజులవుతున్నా.. ఇంతవరకూ మార్చకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రింట్లు కావాలంటే ఆరో అంతస్తులో సీఎం సీపీఆర్వో చాంబర్కు వెళ్లాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి...
రూ.7,635 కోట్ల ట్రూ-అప్ గండం
ఏసీబీ వలలో ఇద్దరు మహిళా అధికారులు
జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు?
Read Latest Telangana News And Telugu News