Share News

రూ.7,635 కోట్ల ట్రూ-అప్‌ గండం

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:06 AM

విద్యుత్‌ వినియోగదారుల నుంచి ట్రూ-అప్‌ చార్జీల రూపంలో రూ.7,635కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది.

రూ.7,635 కోట్ల ట్రూ-అప్‌ గండం
True Up Charges

  • విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.5,420 కోట్లు,

  • ప్రభుత్వం నుంచి రూ.2,215 కోట్ల వసూలుకు ఈఆర్‌సీ అనుమతి

  • నవంబరు నుంచే ట్రూ-అప్‌ చార్జీల వసూలుకు డిస్కమ్‌ల నిర్ణయం

  • యూనిట్‌కు 30 పైసల పెంపు

  • డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసలు పెంచి వసూలు

  • 100 యూనిట్లు వాడితే నవంబరులో రూ.30,

  • డిసెంబరు నుంచి రూ.50 చొప్పున అదనంగా కరెంటు చార్జీలు

  • దక్షిణ డిస్కమ్‌ పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కమ్‌

  • పరిధిలో 26 నెలల పాటు ట్రూ-అప్‌ చార్జీల వసూలు

  • వ్యవసాయ వినియోగం ఖాతాలో రూ.2,215 కోట్లు

  • వీటి చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారుల నుంచి ట్రూ-అప్‌ చార్జీల రూపంలో రూ.7,635కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌, మెంబర్లు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈఆర్‌సీ అనుమతితో నవంబరు నెల నుంచి డిస్కమ్‌లు ట్రూ-అప్‌ చార్జీలను వసూలు చేసుకోనున్నాయి. నవంబరు నెలలో యూనిట్‌కు 30 పైసల చొప్పున, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచి డిస్కమ్‌లు ఈ ట్రూ-అప్‌ చార్జీలను వినియోగదారుల నుంచి రాబట్టుకోనున్నాయి. అంటే నవంబరులో వచ్చే బిల్లులో ఓ ఇంట్లో 100యూనిట్ల కరెంటు వాడారనుకుంటే ఇప్పుడున్నదానికంటే అదనంగా రూ.30బిల్లు వస్తుంది. అదే డిసెంబరు నుంచి అయితే, రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.


దక్షిణ డిస్కమ్‌లో(టీజీ ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌) 29 నెలల పాటు, ఉత్తర డిస్కమ్‌లో(టీజీ ఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) 26 నెలల పాటు ఈ చార్జీలను వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతినిచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5,186 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,448 కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.7,635కోట్ల ట్రూ-అ్‌పకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.2,214.99 కోట్లను వ్యవసాయ వినియోగం ఖాతాలో లెక్క వేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.5,420.23 కోట్లను డిస్కమ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నాయి. ఇందులో, దక్షిణ డిస్కమ్‌ రూ.4,222.93 కోట్లు, ఉత్తర డిస్కమ్‌ రూ.1,197.30 కోట్లు వసూలు చేసుకోనున్నాయి. నవంబరు నుంచి కరెంటు బిల్లుల్లో ట్రూ-అప్‌ ఛార్జీలు కనిపించనున్నాయి.


ఈ చార్జీలను సాధారణ విద్యుత్‌ బిల్లులో కలపకుండా ప్రత్యేకంగా చూపించాల్సి ఉంటుంది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఎంత నెలవారీ వినియోగం లెక్కించారో, ఏ రేటును వర్తింపచేశారో ఆ వివరాలను బిల్లులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఒక నెలలో రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రికవరీ ఉంటే... రెండింటినీ విడివిడిగా చూపించాలి. ట్రూ-అప్‌ చార్జీల వసూలు విధానంపై ముందుగా అన్ని వార్తా పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.


డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.57,336 కోట్ల బకాయిలు

వాస్తవానికి డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. విద్యుత్‌ సంస్థలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.57,336 కోట్లు కరెంట్‌ బిల్లుల రూపంలో రావాల్సి ఉంది. అందులో ఒక్క నీటిపారుదలశాఖ నుంచే ఎత్తిపోతల పథకాల కింద రూ.29,264 కోట్లు రావాల్సి ఉంది. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తే... డిస్కమ్‌లు జెన్‌కోలు, సింగరేణికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నిజానికి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు యూనిట్‌కు 30పైసల చొప్పున చార్జీలను పెంచి వసూలు చేసుకోవాలని ఈఆర్‌సీ అనుమతినిచ్చినప్పటికీ డిస్కమ్‌లు అమలు చేయలేదు. దీంతో, బకాయిలు పేరుకుపోయాయి. డిస్కమ్‌ల అధికారుల అసమర్థ నిర్ణయాలు విద్యుత్‌ సంస్థ మనుగడకే శాపంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి.


బీఆర్‌ఎస్‌ హయాంలో అంగీకరించినా చెల్లింపుల్లేవు

2016-17 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్‌ కొనుగోళ్లకు అంచనా వేసిన వ్యయం కన్నా వాస్తవంగా అయిన ఖర్చు రూ.10,281.73 కోట్లు. దీంతో పాటు, వీలింగ్‌ ట్రూ-అప్‌ కింద రూ.203.83 కోట్లు, ఉదయ్‌ ఒప్పందం ప్రకారం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.2,232.84 కోట్లను కలిపి మొత్తం రూ.12,718 కోట్లను ట్రూ-అప్‌ చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడానికి అనుమతినివ్వాలని డిస్కమ్‌లు అప్పట్లో కోరగా...తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ ఈఆర్‌సీ) సంప్రదింపులతో ఆ చార్జీల చెల్లింపులకు రాష్ట్రప్రభుత్వమే ముందుకొచ్చింది. రూ.12,718 కోట్ల భారాన్ని ప్రజలపై వేయరాదని, ఆ మొత్తాన్ని ఏటా రూ.2,543.6 కోట్ల చొప్పున ఐదేళ్లలో చెల్లించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం వార్షిక వడ్డీ ఎంత ఉంటుందో ఆ వడ్డీతో సహా డిస్కమ్‌లకు చెల్లింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకార పత్రాన్ని కూడా సమర్పించింది. కానీ, ఒక్క వాయిదా కూడా చెల్లించకుండానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్క వాయిదానూ చెల్లించలేదు. ఈ చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.


ట్రూ-అప్‌ చార్జీలు అంటే

ట్రూ-అప్‌ చార్జీలు అంటే డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలు చేయడానికి అంచనా వేసిన ఖర్చుకు, వాస్తవంగా అయిన ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయడానికి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డిస్కమ్‌లకు రాబోయే ఏడాదికి అవసరమయ్యే విద్యుత్‌ కొనుగోలు ఖర్చులపై ఒక అంచనా నివేదికను ఈఆర్‌సీకి సమర్పిస్తాయి. దాని ఆధారంగా కరెంటు చార్జీల స్లాబ్‌ రేట్లు ఖరారు అవుతాయి. అయితే, తర్వాత ఏడాది కాంలో బొగ్గు, గ్యాస్‌, ఇంధన ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరగడం వల్లనో, కరెంటుకు డిమాండ్‌ పెరిగి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సి రావడం వల్లనో డిస్కమ్‌లకు ఖర్చు పెరుగుతుంది. ఈ పెరిగిన ఖర్చును ట్రూ-అప్‌ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.


ఇవి కూడా చదవండి...
వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం

అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా, నలుగురు మహిళల మృతి

రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 04:11 AM