Share News

జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు?

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:27 AM

మీకే జవాబుదారీతనం లేకపోతే ఎలా? అని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన మధుకర్‌ పార్టీ రాష్ట్ర పదాధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు?
Ramchander Rao

  • మీకే జవాబుదారీతనం లేకపోతే ఎలా?

  • ఇలాగైతే కేడర్‌కు ఏం సంకేతాలు వెళ్తాయ్‌?

  • బీజేపీ రాష్ట్ర పదాధికారులపై సంస్థాగత ప్రధాన కార్యదర్శి అసంతృప్తి!

  • ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కేంద్ర నాయకత్వానికి నివేదించాలని నిర్ణయం

  • ‘ఇండి’ కూటమి విష ప్రచారం

  • రాష్ట్రంలోనూ భారీ సంఖ్యలో చొరబాటుదారులు : రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మీకే జవాబుదారీతనం లేకపోతే ఎలా? అని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన మధుకర్‌ పార్టీ రాష్ట్ర పదాధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించలేనివారు కూడా రాష్ట్రకార్యవర్గంలో ఉంటే అధికారంలోకి ఎలా వస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్‌, సహ ఇన్‌చార్జిగా అభయ్‌పాటిల్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌లు నియమితులైన తర్వాత తొలి రాష్ట్ర పదాధికారుల సమావేశం సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.


ఈ సందర్భంగా మధుకర్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో మీరు ఎందుకు పర్యటించడం లేదు? రాష్ట్ర పదాధికారులే క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల కిందిస్థాయి కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళతాయో గుర్తించారా? అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసినవారికే పదవులు వస్తాయని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై చర్చించారు. కాగా ఎన్నికల నిర్వహణ కమిటీ, అభిప్రాయ సేకరణ కమిటీల సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేంద్ర నాయకత్వానికి నివేదించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి ఎన్‌. గౌతంరావు తెలిపారు.


మున్సిపల్‌ ఎన్నికల పార్టీ నిధుల లెక్క తేలాల్సిందే.. : అభయ్‌పాటిల్‌

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్‌ దుర్వినియోగం కావడం పట్ల బీజేపీ సహ ఇన్‌చార్జి అభయ్‌పాటిల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదాధికారుల సమావేశం అనంతరం పలువురు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జులతో మరో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ్‌పాటిల్‌ మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డవారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. ‘మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు సంబంధించి పార్టీ నిధులు ఎవరెవరు.. ఎంతెంత వాడుకున్నారో నా వద్ద సమాచారం ఉంది. ఆ మొత్తాన్ని వారు పార్టీకి జమ చేయాల్సిందే. లేనిపక్షంలో బాధ్యులపై క్రిమినల్‌ కేసులకు కూడా వెనుకాడబోను..’ అని అభయ్‌పాటిల్‌ స్పష్టం చేశారు.


‘ఇండి’ కూటమి విష ప్రచారం: రాంచందర్‌రావు

చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తుంటే ‘ఇండి’ కూటమి విషప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భారీ సంఖ్యలో అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రోహింగ్యాలు, అక్రమ ఓటర్లు ఉన్నట్లు తేలిందని రాంచందర్‌రావు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యావత్‌ ప్రపంచం మన ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియను చూసి గర్విస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దేశంపై, ఎన్నికల సంఘంపై ఏడుస్తూ అవాకులు చవాకులు పేలుతోందని మండిపడ్డారు.


ఒక సాధారణ చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. నెహ్రూ కుటుంబం నుంచే ప్రధాని కావాలనే సంకుచిత భావనతో దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చెల్లవంటూ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘ఎన్నికలు చెల్లవనుకుంటే.. మొదట తెలంగాణలో అక్రమంగా గెలిచిన సీఎం రేవంత్‌ రెడ్డి చేత, కేరళం, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రుల చేత రాజీనామాలు చేయించాలి.’ అని రాంచందర్‌రావు ఖర్గేకు సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఈవీఎంలు, ఈసీ మంచివని.. ఓడిపోతే మాత్రం వాటిపై నిందలు వేయడం కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు సహా హామీలేవీ అమలు చేయలేదని రాంచందర్‌రావు ఆరోపించారు.


పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ కుటుంబం బాగుపడితే, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో రేవంత్‌ రెడ్డి అండ్‌ బ్రదర్స్‌ దోచుకుంటూ బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు తీరలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కేవలం కమీషన్లు, కాంట్రాక్టులు, ఢిల్లీకి ముడుపులు పంపడంలోనే మునిగిపోయారని రాంచందర్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబంలో అక్రమ ఆస్తుల పంపకాల కోసం పంచాయతీలు నడుస్తున్నాయని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరి దోపిడీని మరొకరు నిందించుకుంటూ నాటకమాడుతున్నాయని ఫైరయ్యారు. వీరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణను రక్షించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో హిందువులకు, హిందూ సాంస్కృతిక విలువలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


గతంలో ఎన్నికల ప్రచారంలో ‘‘ముస్లిం ఈజ్‌ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ ఈజ్‌ ముస్లిం’’ అంటూ బాహాటంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు హిందూ దేవతలను, భక్తుల విశ్వాసాలను, ఆచారాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ గుడి ఘటన మొదలుకొని ఇటీవల మల్కాజిగిరి, దిల్‌సుఖ్‌నగర్‌ సంతోషిమాత ఆలయాల వరకు వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం వెనుక స్పష్టమైన కుట్ర ఉందని రాంచందర్‌రావు అన్నారు. దాడి జరిగిన ప్రతిసారీ పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడికి ‘మతి స్థిమితం లేదు’ అంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం రివాజుగా మారిందని, మతి స్థిమితం లేని వారికి కేవలం హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. మజ్లిస్‌ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు.


ఇవి కూడా చదవండి...
రూ.7,635 కోట్ల ట్రూ-అప్‌ గండం

ఏసీబీ వలలో ఇద్దరు మహిళా అధికారులు

రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 04:27 AM