Share News

నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:15 PM

కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం జాతర జరిగింది. ఈ సమ్మక్క జాతరకు శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో కలిసి భారీ కాన్వాయితో బయలుదేరారు. అయితే ఆయన కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు..

నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
BRS MLA Padi Kaushik Reddy

కరీంనగర్, జనవరి 31: కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌‌ మత మార్పిడి చేస్తున్నారంటూ తాను వ్యాఖ్యలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు. లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానంటూ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ నాయకులకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో మినీ మేడారం జాతర జరిగింది. ఈ సమ్మక్క జాతరకు శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో కలిసి భారీ కాన్వాయితో బయలుదేరారు. ఆయన కాన్వాయిని‌ పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేవలం నాలుగు వాహనాల్లోనే జాతరకు వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రహదారిపై బైఠాయించి.. ఆందోళనకు దిగారు.


ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు తమ విధులకు సైతం అటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇక పాడి కౌశిక్ రెడ్డిని పరిమిత వాహనాల్లో వీణవంక సమ్మక్క జాతరకు అనుమతించారు. అక్కడ సైతం పాడి కౌశిక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని.. అక్కడి నుంచి ఆయన్ను పంపించేశారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకొంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

కోఠి ఏటీఎం వద్ద కాల్పులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 02:54 PM