కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం: కేటీఆర్
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:59 PM
కరీంనగర్ మామూలు జిల్లా కాదని, సింహగర్జన చేసిన కొదమ సింహాల జిల్లా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిందని ఆయన ప్రశంసించారు.
కరీంనగర్, నవంబర్ 29: కరీంనగర్ మామూలు జిల్లా కాదని, సింహగర్జన చేసిన కొదమ సింహాల జిల్లా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిందని ఆయన ప్రశంసించారు. నాడు కరీంనగర్ మట్టిని బొట్టుగా పెట్టుకుని తెలంగాణ ఉద్యమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారని కేటీఆర్ గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అలుగునూరులో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమ నాటి పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల కారణంగానే నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత సమైక్యాంధ్ర నేతలు కుట్రలకు తెరలేపారని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధిస్తే.. భూమికి మూడు అడుగుల ఎత్తు కూడా లేని నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం లేకపోతే టీబీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికి ఎక్కడిదని ప్రశ్నించారు.
సోనియా గాంధీని బలిదేవత అన్నవాళ్లే నేడు వేదికలెక్కి మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సోనియా గాంధీ రచించిన పుస్తకంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి ప్రస్తావన లేదని విమర్శించారు. దేశమంతా కాంగ్రెస్ను దూరం పెడుతుంటే.. ఇక్కడ మాత్రం నెత్తిన పెట్టుకున్నామని ఆగ్రహించారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై దాడి జరుగుతోందని ఆరోపించారు కేటీఆర్. ఆ ప్రాజెక్టులో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించరా రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. కుప్పానికి చంద్రబాబు నీటిని తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ విషం కక్కారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా?: ఎమ్మెల్యే హరీశ్ రావు
తీవ్ర విషాదం.. శుభకార్యం జరగాల్సిన ఇంట విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే ప్రమాదం: ఎంపీ మల్లు రవి