Share News

డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే ప్రమాదం: ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:16 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే ప్రమాదం: ఎంపీ మల్లు రవి
Mallu Ravi

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ.. అదే డీలిమిటేషన్ బిల్లు. ఈ బిల్లుపై పలువురు నేతలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలను అణచివేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పెరియార్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. డీఎంకే సిద్ధాంతం బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.


మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని మల్లు రవి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలోనే ముందుకు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అప్పుడే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎంపీలను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే మనకు మనమే ఉరితాడు వేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత, ఎస్టీ ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మల్లు రవి పిలుపునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 01:18 PM