Karimnagar: ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తిచేయాలి
ABN , Publish Date - May 02 , 2026 | 12:19 AM
కరీంనగర్ టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు.
- మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్
కరీంనగర్ టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, గృహనిర్మాణశాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొదటి విడతలో ఇళ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టలేమని నగరపాలక సంస్థకు లిఖిత పూర్వకంగా రాసిన లబ్దిదారులను తొలగించి వారి స్థానంలో అర్హులైన కొత్తవారిని ఎంపిక చేయాలని సూచించారు. డివిజన్ల వారీగా ఎల్-1లో ఉన్న లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిశీలించి నిజమైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అన్నారు. ఇండ్ల నిర్మాణాంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని హౌజింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా డివిజన్లలో పర్యటించి నాణ్యత పరిశీలించాలని అన్నారు. అర్హులైన ప్రతి పేద వారి కలను సాకారం చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, హౌజింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.