జగిత్యాలలో జగడం.. తీవ్రంగా స్పందించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:03 PM
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగిత్యాల, ఫిబ్రవరి 03: మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపడంతో.. మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నివాసం వద్ద మంగళవారం నాడు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల విషయంలో తన గొంతు కోశారంటూ అనుచరుల ఎదుట జీవన్ రెడ్డి కలత చెందినట్లు తెలుస్తోంది.
రాజీ లేదు.. రాజీనామానే అంటూ కార్యకర్తలకు జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో ఎమ్మెల్యే సంజయ్ నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన అనుచరులు, కార్యకర్తలు ఈ సందర్భంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జగిత్యాలలోని మొత్తం 50 వార్డుల్లో సంజయ్ వర్గానికి 29, జీవన్ రెడ్డి వర్గానికి 21 టికెట్లు కేటాయించారు. ఏడాదిన్నరగా ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సంజయ్ వ్యవహార శైలిపై జీవన్ రెడ్డి కాస్త గుర్రుగా ఉంటున్నారు. ఇప్పటివరకూ జీవన్ రెడ్డిని శాంతింప చేసేందుకు అధిష్ఠానం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం ఆయనకు అధిష్ఠానం పెద్దలు ఫోన్ సైతం చేయకపోవడం గమనార్హం. దాంతో జీవన్‌రెడ్డిని హైకమాండ్ లైట్ తీసుకుందంటూ ఒక ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ బరిలో దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అనంతరం సంజయ్.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రాకను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగి.. జీవన్ రెడ్డిని శాంతింప చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరారు.
నాటి నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. వాటిలో ఒకటి జీవన్ రెడ్డి వర్గం కాగా.. మరొకటి సంజయ్ వర్గం. ఈ వర్గాల మధ్య పోరు ఇటీవల మరింత తీవ్రమైంది. ఒక వర్గంపై మరో వర్గం ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకొంటుంది. దీంతో జగిత్యాలలో ఇరువర్గాల మధ్య జగడం నిత్యకృత్యంగా మారింది. అలాంటి వేళ పార్టీ వీడేందుకు సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి సన్నాహకాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పడమర వీధి గంగానమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు
Read Latest Telangana News and National News