Share News

ముగిసిన భేటీ.. పట్టు వీడని జీవన్ రెడ్డి

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:57 AM

తాను పార్టీని వీడడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌ గౌడ్‌ ఎదుట మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం..

ముగిసిన భేటీ.. పట్టు వీడని జీవన్ రెడ్డి
T Jeevan Reddy

జగిత్యాల, మార్చి 24: తాను కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌ గౌడ్‌ ఎదుట మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కుండ బద్ధలు కొట్టినట్లు సమాచారం. మంగళవారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో వారు జరిపిన మంతనాలు విఫలమయ్యాయి. అధిష్ఠానం బుజ్జగింపులను జీవన్ రెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.


పార్టీకి రాజీనామా చేసే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా వారికి జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే బుధవారం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జీవన్ రెడ్డి సన్నాహలు చేస్తున్నారు. దాదాపు 5 వేల మంది కార్యకర్తలతో ఆయన ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభా వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటిస్తారనే చర్చ సైతం సాగుతోంది.


కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న వరుస అవమానాలను.. జీవన్ రెడ్డి ఇప్పటికే వివిధ వేదికల ద్వారా బహిరంగంగా వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడడానికి ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.


పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన తేదీ సమీపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డిని బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని భావించింది. అందుకోసం పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపి మంతనాలు జరిపింది. కానీ జీవన్ రెడ్డి మాత్రం తన పట్టు వీడలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తథ్యమని వారికి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 11:23 AM